
భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్, వెలుగు : పులి చర్మం, గోర్లను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ బి.రోహిత్‌రాజ్ వెల్లడించారు.
చింతూరు మండలంలోని గమ్మలకోట గ్రామానికి చెందిన అటవీ ప్రాంతంలో ఉన్న ఓ గుంతలో గతేడాది చిరుతపులి పడిపోయింది. దీనిని గమనించిన అదే గ్రామానికి చెందిన కుంజా భద్రయ్య, పోలవరం గ్రామానికి చెందిన కుంజా గంగరాజు, మడవి కన్నయ్య కలిసి చిరుతపులిని రాళ్లు, కర్రలతో కొట్టడంతో పాటు బాణాలు వేసి చంపేశారు. అనంతరం దాని చర్మంతో పాటు గోర్లు తీసుకొని భద్రపరిచారు.
ఇటీవల తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన అనిల్ కౌలు భూమి కోసం భద్రయ్య ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన వద్ద చిరుతపులి చర్మం, గోర్లు ఉన్నాయని, వాటిని అమ్మి పెట్టాలని భద్రయ్య కోరారు. తర్వాత పులి చర్మం, గోర్లను తీసుకొని భద్రయ్య, గంగరాజు, కన్నయ్య కలిసి అనిల్ ఇంటికి వెళ్లారు.
సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పులి చర్మంతో పాటు 17 గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్, ఎస్బీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీశ్, టాస్క్ ఫోర్స్సీఐ రమాకాంత్, ఎస్సైలు నాగ బిక్షం, ప్రవీణ్, సుమన్ పాల్గొన్నారు.