Reading Time: < 1 minute

బీజేపీలో కొండా సురేఖ చేరికపై అధిష్టానిదే నిర్ణయం: డీకే అరుణ

Caption of Image.

 సీఎం రేవంత్ రెడ్డిపై  బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడూ పబ్లిసిటీ కావాలని.. విదేశీ పర్యటనలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ఆయన తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతి ఒక్కరి పాస్‌పోర్ట్‌కు తగిన క్లియరెన్స్ ఉండాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే పాస్‌పోర్ట్ క్లియరెన్స్, విదేశీ పర్యటనలకు సంబంధించిన అనుమతులు ఉంటాయని తెలిపారు.

ఇక బీజేపీలో ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారాన్ని డీకే అరుణ ఖండించారు. బీజేపీ ఎంపీలందరం  కలిసే ఉన్నామని.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తారన్న ప్రచారంపైనా డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆమె అన్నారు.

 కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం అంటూ జరుగుతున్న ప్రచారంపైనా డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరిని గద్దె దించుతుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.రాజకీయాల్లో ఒక బాధ్యత నుంచి తప్పించినా.. పార్టీ మరో మంచి బాధ్యతను అప్పగించే అవకాశం ఉంటుందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. 

 

©️ VIL Media Pvt Ltd.