
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతోంది. దీంతో… ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం పేరిట సమరభేరి మోగించబోతోంది బీఆర్‌ఎస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ పోరు బాట పట్టబోతోంది. అయితే… ఏదో, తూతూ మంత్రంగా ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి వదిలేయకుండా… వారం రోజులపాటు నిరసన ప్రర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది గులాబీ అధిష్టానం. సమరభేరి పేరిట పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, వారంపాటు షెడ్యూల్ వేయడం వెనక గట్టి కారణమే ఉండవచ్చని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ… జిల్లా, నియోజకవర్గాల లెవల్‌లో మాత్రం మమ అనిపిస్తున్నట్టు అధిష్టానం దగ్గర ఫీడ్‌బ్యాడ్ ఉందట. అందుకే…ఈసారి వారంపాటు చేయబోయే సమరభేరిని చేశామంటే చేశాం అన్నట్టు కాకుండా…సీరియస్‌గా జరపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. దీంతో… కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావాలంటే… దాంట్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కచ్చితంగా పాల్గొనాలని కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారట.
అదే సమయంలో పార్టీ నేతలకు ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లకపోయినా పెద్దగా పట్టించుకోలేదని, ఇక మీదట అలా ఉండబోదని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై వారం రోజులపాటు సమరభేరి చేయాలని ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని, ఇది భవిష్యత్ సంకేతమని అన్నట్టు చెప్పుకుంటున్నారు. వారం రోజుల కార్యక్రమాన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా సక్సెస్ చేయాలని కేటీఆర్ గట్టిగా అన్నట్టు తెలిసింది. గతంలోని కార్యక్రమాల మాదిరిగానే దీన్ని కూడా లైట్ తీసుకుంటే వాళ్లను పార్టీ కూడా లైట్ తీసుకుంటుందని స్ట్రాంగ్‌గా హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు పార్టీ కార్యక్రమాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారని, ఆ వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని అన్నారట కేటీఆర్. ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉండటంతో.. ఇప్పట్నుంచే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలకు చెప్పారట కేటీఆర్. సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయకుంటే అలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన నిర్ణయాలు ఉంటాయని కూడా కేటీఆర్ కుండబద్దలు కొట్టారని చెబుతున్నారు.
సమరభేరి కార్యక్రమం విజయవంతంకాని నియోజకవర్గాలను గుర్తించి… అక్కడి ఇన్చార్జ్‌లను మార్చే ప్రతిపాదన కూడా ఉందట.ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందేమోనని, ఏ నియోజకవర్గం ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పట్నుంచే ఖర్చు చేయడం ఎందుకని కొందరు దూరంగా ఉంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారట కేటీఆర్. ఏ కార్యక్రమమైనా రాష్ట్ర పార్టీ నుంచి ఖర్చు చేయాలంటే కష్టమని, లోకల్ గా ఉన్నవాళ్లు, గతంలో పదవులు అనుభవించిన వాళ్ళే అన్నీ చూసుకోవాలని పరోక్షంగా చెప్పినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా… ఇక ఎన్నికల టైం సమీపించేకొద్దీ వత్తిడి పెరుగుతుంది కాబట్టి… ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్.