
యష్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ ఎంత బాగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కన్నడ హీరోకి ఆ సిరీస్ ఏకంగా పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ సిరీస్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మలయాళం నుంచి గీతూ మోహన్‌దాస్ అనే మహిళా దర్శకురాలి దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశారు. దానికి తోడు నయనతార యష్ సోదరిగా నటించడం, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే అంచనాలు అందరిలోనూ పెరిగిపోయాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది? యష్ తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పేరుతో నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
టాక్సిక్ కథ:
దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా గోవాలో మాత్రం పోర్చుగీస్ పాలన కొనసాగుతున్న రోజులవి. తన సోదరి గంగ (నయనతార) సాయంతో రాయ (యష్) గోవా మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గోవాని ఏలుతున్న సాల్వడార్ కూతురు రెబెకాతో రాయ పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే మరోపక్క అదే ఊరిలో ఒక సర్కస్ కంపెనీ నడిపే నదియా (కియారా అద్వానీ)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే గోవా మొత్తాన్ని ఏలడానికి నదియాను పక్కన పెట్టాలని సోదరి గంగ సూచించడంతో అందుకు కూడా సిద్ధమవుతాడు రాయ. మరి ప్రేమించిన ప్రియురాలికి సైతం దూరమైన రాయ గోవా మీద పట్టు సాధించాడా? అతను మకావు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు రాయ, గంగల కథేమిటి? వీరిద్దరూ కలిసి అసలు ఏం చేయాలనుకున్నారు? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
యష్ హీరోగా ‘టాక్సిక్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అయితే సినిమా అనేక వాయిదాలు పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా వర్కౌట్ అయింది. దీంతో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తితోనే థియేటర్‌లోకి వెళ్తాం. మొదటి సీన్ నుంచే అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ముందుగా కియారా అద్వానీ (నదియా) పాత్రతో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనే ఆసక్తి పెంచి వెంటనే కథను ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకువెళ్తారు. అసలు ఒక రాయ ప్రస్థానం, రాయ ఎవరి కోసం కష్టపడుతున్నాడు, రాయకి కావాల్సిందేంటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే అతనిని ఒక మాన్‌స్టర్‌గా ప్రజెంట్ చేశారు.
అయితే ఎక్కడా సినిమాలో హై మూమెంట్స్ లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. సినిమా స్క్రీన్ మీద యష్ స్టైలిష్ యాక్షన్ అదిరిపోయింది, ముఖ్యంగా ఫైట్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. కానీ కేజీఎఫ్ ఇచ్చినంత కిక్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది. అదే కాక కేజీఎఫ్ హ్యాంగోవర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అసలు ఎవరు ఎందుకు ఎవరిని చంపుతున్నారు అనే విషయం మీద ఎన్నో అనుమానాలు కలిగేలా కథ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన కిక్కు కూడా కాస్త డ్రాప్ అవుతూ వెళ్తుంది. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు రాయ ఇలా ప్రవర్తిస్తున్నాడు, అతని కొడుకు పాత్రధారి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని అనుమానాలు కలిగిస్తూనే ప్రీ క్లైమాక్స్ వరకు తీసుకువెళ్లారు.
ప్రీ క్లైమాక్స్‌కి వచ్చాక వాళ్ళు దాన్ని షాకింగ్ ట్విస్ట్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ, అది మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడ మొదలుపెట్టిన సైకలాజికల్ డ్రామా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయితే కాలేదు. నిజానికి ఇది షాక్ ఫ్యాక్టర్ అని వారు భావించి ఉండవచ్చు, కానీ ఇలాంటి సినిమాలు తెలుగు వారికి కొత్త ఏమీ కాదు. గతంలో ఒకట్రెండు సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. కాకపోతే యష్ స్టైలిష్ యాక్షన్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రమే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు అని చెప్పక తప్పదు. కథ రొటీన్ అనిపిస్తూనే ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫీలింగ్ తీసుకొచ్చింది. అయితే ఎక్కడా ఎమోషన్ ఎస్టాబ్లిష్ కాకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశమే. యష్ సోదరిగా నయనతార పాత్ర పరిమితమే. అన్నాచెల్లెళ్ల మధ్య ఎమోషన్‌ను బిల్డ్ చేయడంలో టీం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే సినిమా సెకండ్ హాఫ్ కూడా ‘ఇంకా సినిమా అయిపోలేదా?’ అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, యష్ రాయ అనే పాత్రతో పాటు టికెట్ అనే మరో పాత్రలో మెరిశాడు. తనదైన స్వాగ్, స్టైల్ మెయింటైన్ చేస్తూ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన డామినెన్స్ చూపించాడు. అయితే కొంతమందికి కేజీఎఫ్ హ్యాంగోవర్‌ని క్యారీ చేసిన ఫీలింగ్ కూడా కలిగి ఉండవచ్చు. ఇక నయనతార పాత్ర పరిమితమే అయినా, కనిపించిన కొద్దిసేపు ఆమె ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా స్టైలిష్‌గా కనిపించింది. కియారా అద్వానీ కూడా చాలా క్రూషియల్ పాత్రలో తనదైన నటనతో మెప్పించింది. ఒకపక్క అందాలు ఆరబోస్తూనే మరోపక్క అభినయంతోనూ ఆకట్టుకుంది. హుమా ఖురేషి పాత్ర చాలా లిమిటెడ్, కానీ ఆమె కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక రుక్మిణి వసంత్ పాత్ర పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. సుదేవ్‌తో సహా మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి కరెక్ట్‌గా సరిపోయింది. ఎక్కడా ఒక్క నార్మల్ లొకేషన్ కూడా లేదు; అయితే భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) షాట్స్ ఉన్నాయి, లేదా ఒక లగ్జరీ సెట్‌లో ప్లాన్ చేశారు. నార్మల్ సీన్ ఒక్కటి కూడా అవుట్‌డోర్‌లో లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. పాటలు బాగున్నాయి, నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు కానీ ఇంకాస్త బెటర్‌గా చేసి ఉండొచ్చు. నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ కొంతవరకు మెరుగ్గా ఉండేది.
ఓవరాల్‌గా ఈ ‘టాక్సిక్’.. మితిమీరిన వయోలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే!