
ఇది మామూలు ట్విస్టు కాదు.. అవినీతి కేసులో అరెస్టై జైల్లో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగి.. హాస్పిటల్ లో ప్రియురాలితో పట్టుబడటం సంచలనంగా మారింది. జడ్జి ఇచ్చిన షాక్ కు ఆ అధికారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి. కర్ణాటకలో 2026 ఆగస్టు 25న బయటపడిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే మాండ్య జిల్లాలోని ఆ ఆసుపత్రిలో ఈ బాగోతం బయటపడింది. శ్రీరంగంపట్నానికి చెందిన ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ హుస్సేన్.. అవినీతి ఆరోపణలో అరెస్టయ్యాడు. జైలుకెళ్లే ముందు జడ్జి దగ్గర హాజరు పరిచి.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మాండ్య ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS) లో ప్రత్యేక రూమ్ కేటాయించి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు ఆయనకు.
అయితే జైలుకెళ్లాల్సిన అధికారికి ఆస్పత్రిలో భోగలాలసలో మునిగి తేలుతున్నట్లు వచ్చిన సమాచారంతో మాండ్య జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సి.చంద్రశేఖర్ ఆసుపత్రి తనిఖీకి వెళ్లారు. తన సిబ్బందితో కలిసి హాస్పిటల్ విజిట్ చేసిన జడ్జీ.. హుస్సేన్ ను అడ్మిట్ చేసిన వార్డులో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హుస్సేన్ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు జడ్జి. ఆయనకు ఎలాంటి జ్వరం కాని, అస్వస్థత లేదని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.
అయితే అధికారిని అడ్మిట్ చేసిన గదిలో యువతి కనిపించడంతో ఇనిస్పెక్షన్ కొత్త టర్న్ తీసుకుంది. ఆమె గురించి అడగగా.. ఆ అధికారి గర్ల్ ఫ్రెండ్ ను అని డైరెక్టుగా చెప్పడంతో అందరూ షాకయ్యారు.
మెడియల్ ట్రీట్ మెంట్ అవసరం లేకపోయినా ఆయనను ఆసుపత్రిలో ఎందుకు కొనసాగిస్తున్నారని జడ్జి జైల్ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం కోర్టు వరకు వెళ్లలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్దామని అనుకునే లోపే తమరకి తెలిసిపోయిందని జైలు అధికారి ఒకరు జడ్జికి చెప్పారు.
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా జైలు అధికారులతో పాటు.. MIMS హాస్పిటల్ ను ఆదేశించారు. ఈ మ్యాటర్ పై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.