
ఇండోనేషియా ఆర్మీలో ఫస్ట్ టీఎన్‌ఐ ఏడీ శిక్షణ ముగింపు వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సైనికులందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతూ కనిపించారు.
అయితే, ఆ సైనికుల మధ్యలో ఒక యువ రిక్రూట్ మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. అతన్ని పలకరించడానికి ఎవరూ రాలేదు. తన చుట్టూ ఉన్న తోటి సైనికులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతుంటే, ఆ యువకుడు మాత్రం ఒంటరిగా నిలబడి ఆ దృశ్యాలను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కుటుంబానికి దూరంగా ఉండటంతో అతని మనసు తీవ్రంగా వేదనకు గురైంది.
కమాండర్ ఆత్మీయ ఆలింగనం
అది గమనించిన ఆర్మీ కమాండర్ వెంటనే ఆ యువ సైనికుడు ఉన్న చోటుకి వెళ్లారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, ఎంతో ప్రేమతో ఆ సైనికుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నారు. కమాండర్ చూపిన ఆ ఆత్మీయతను ఆ యువ సైనికుడు అసలు ఊహించలేకపోయాడు. ఒక్కసారిగా అతని భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. కమాండర్ భుజాలపై తలపెట్టి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ సమయంలో కమాండర్ అతన్ని ప్రేమగా ఓదారుస్తూ సరదాగా నవ్విస్తూ ధైర్యం చెప్పారు. ఈ హృదయవిదారక ఘటన అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ప్రశంసలు
ఈ భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు రాలేదన్న బాధలో ఉన్న ఆ సైనికుడి ఒంటరితనాన్ని కమాండర్ గుర్తించి ఇచ్చిన హగ్ అతనికి ఎంతో సాంత్వన ఇచ్చిందని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
కమాండర్ చూపిన కనికరం, మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “అది ఒక తల్లిదండ్రులు ఇచ్చే ఆలింగనం లాంటిది” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, “సైనికుల పట్ల ఉన్నతాధికారులు ఇలాంటి ప్రేమను చూపించడం అద్భుతం” అంటూ మరికొందరు కొనియాడుతున్నారు.