
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 ఆగస్టు 26 తెల్లవారు జామున సూర్యాపేట జిల్లాలో కంటైనర్ ను ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో 5 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
కోదాడ మండలం దొరకుంట శివారులో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ను ఫ్రెష్ బస్ డాట్ కామ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు సీట్ల మధ్య ఇరుక్కుపోయారు. ఐదుగురు చనిపోగా.. సీట్ల మధ్యన ఇరుక్కున్న క్షతగాత్రుల ఆర్థనాదాలతో ఘటనా స్థలం మారుమోగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
యాక్సిడెంట్ కారణంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలే ఏమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.