
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్‌గా చేసిన పరుగుల్లోనూ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించి:
రెండో టెస్టు రెండో రోజు రిషభ్ పంత్ 89 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లతో టెస్టు క్రికెట్‌లో పంత్ మొత్తం సిక్సర్ల సంఖ్య 102కు చేరింది. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. గిల్‌క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టగా.. పంత్ కేవలం 52 టెస్టుల్లోనే 102 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి:
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనూ రిషభ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గిల్ 42 టెస్టుల్లో 2,917 పరుగులు చేయగా.. పంత్ 2,948 రన్స్ చేశాడు. డబ్ల్యూటీసీలో పంత్ 42 మ్యాచ్‌ల్లో 74 ఇన్నింగ్స్‌లు ఆడి 42.11 సగటుతో పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఆరు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్:
విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగానూ రిషభ్ పంత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఎంఎస్ ధోనీ 48 టెస్టుల్లో 2,496 పరుగులు చేయగా.. పంత్ 2,534 పరుగులకు చేరుకున్నాడు. ఈ గణాంకాలతో పంత్ తన గురువు ధోనీని అధిగమించాడు. పంత్ ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 249 పరుగులు చేశాడు. 62.25 సగటుతో బ్యాటింగ్ చేసిన అతడి స్ట్రైక్ రేట్ 73.02గా ఉంది. ఈ ఏడాది అతడి ఖాతాలో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.