
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్నాపత్నం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. గత కొన్ని రోజులుగా గాంధీ మైదాన్‌లో నిరసన తెలుపుతోన్న విద్యార్థులు మంగళవారం (ఆగస్ట్ 25) ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం ముట్టడికి యత్నించారు.
ఈ క్రమంలోనే జేపీ గోలంబర్ దగ్గర బారికేడ్లను ఛేదించుకుని సీఎం ఇంటి వైపు దూసుకెళ్లారు. దీంతో సీఎం నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఘటన స్థలంలో పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఎం నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. విద్యార్థులను పోలీసులు వెంబడించి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
70వ బీపీఎస్సీ (BPSC) ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేపర్ లీక్ అయ్యిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను వెంటనే రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే, ఉపాధ్యాయ నియామక పరీక్ష (BPSC TRE-4) నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో అవినీతిని అరికట్టి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు.