
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని చటాన్‌పల్లిలో బుధవారం విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. చటాన్‌పల్లిలోని ఓ మటన్ షాపులో విద్యుత్ వైరు రిపేరు చేస్తుండగా జమాల్పూర్ నవీన్(24)కు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
రాఖీ పండుగ వేళ అన్నను కోల్పోయిన చెల్లెలు పూజిత కన్నీటి పర్యంతమైంది. చిన్ననాటి నుంచి తనకు అండగా నిలిచిన అన్న ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరైంది. రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవాల్సిన చెల్లెలు.. అదే రాఖీని అన్న మృతదేహానికి కడుతూ ఇద్దరి మధ్య ఉన్నఅనుబంధాన్ని గుర్తుచేసుకుని బోరున విలపించింది. “అన్నా.. నిన్ను ఇక ఎప్పటికీ చూడలేనా!” అంటూ ఆమె రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగకు ముందు చోటుచేసుకున్న ఈ విషాద ఘటన చూసిన బంధువులు, స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.