Reading Time: 2 minutes
ఇక్కడ ఎవరూ నవ్వట్లేదు.. మొదటి రోజే జాబ్ వదిలేసిన యువకుడు.. పిలిచి హెచ్‌ఆర్ హెడ్ ఆఫర్ ఇచ్చిన బిజినెస్‌మ్యాన్‌!

కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు జీతం, పనివేళలు లేదా పని ఒత్తిడి కారణంగా రాజీనామా చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఒక యువకుడు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆఫీసును వదిలి వెళ్ళిపోవడానికి చెప్పిన కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆఫీసులో ఎవరూ చిరునవ్వుతో లేరు, వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది అనే విచిత్రమైన నెపంతో అతడు జాబ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియజేసే పోస్ట్‌ ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు సాధారణంగా కంపెనీల కోణంలోనే జరుగుతుంటాయి. కానీ, ఒక అభ్యర్థి కూడా కంపెనీ వాతావరణాన్ని అంచనా చేస్తాడని నిరూపించే ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అభిషేక్ అగర్వాల్ లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకున్నారు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అభిషేక్ అగర్వాల్, మూడు వారాల పాటు నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత తాను ఎంపిక చేసుకున్న ఒక అభ్యర్థి కథను లింక్డ్‌ఇన్‌లో షేర్‌చేశారు. జీతం చర్చల నుండి ఆఫర్ ఇచ్చే వరకు అంతా సజావుగా సాగిందని అభిషేక్ వివరించారు. అతను ఆఫీసుకు సమయానికి వచ్చి, సుమారు 10 నిమిషాల పాటు లాబీలో కూర్చున్నాడు. కానీ, నేను అతన్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు, అతను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి, చేరడానికి నిరాకరించాడు. అతడు చేసిన పనికి తాను షాకైనట్టుగా చెప్పాడు..

తొలిరోజే ఉద్యోగానికి నో చెప్పిన అభ్యర్థి:

నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత ఒక అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, మొదటి రోజు ఆఫీస్ లాబీలో కేవలం 10 నిమిషాలు కూర్చున్న తర్వాత అతడు ఉద్యోగంలో చేరేందుకు నిరాకరించాడు. ఆఫీసులో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందనీ, ఉద్యోగులంతా ఒత్తిడిలో ఉంటూ ఎవరూ కనీసం చిరునవ్వుతో లేరని అతడు చెప్పిన సమాధానం అభిషేక్‌ను తీవ్రంగా ఆలోచింపజేసింది.

ఏమైంది, మీరు ఎందుకు చేరడం లేదు?:

అభిషేక్ ఆ అభ్యర్థిని, నీకేమైంది? ఎందుకు చేరకూడదని అనుకున్నావు? అని అడిగాడు. దానికి అతను, సార్, ఈ ఆఫీసులో వాతావరణం ప్రతికూలంగా ఉంది. అందరూ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎవరూ నవ్వడం లేదు. ఒక వ్యక్తి మీటింగ్ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయి, మాయమైపోవాలనుకుంటున్నట్లు కనిపించాడు, అని జవాబిచ్చాడు. ఆ అభ్యర్థి సమాధానానికి అభిషేక్‌ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ తర్వాత అతను తనకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయాడు.. అంతే అన్నాడు.

ఆ తరువాత తన ఆఫీసు పరిస్థితిని నిశితంగా గమనించిన అభిషేక్, ఆ అభ్యర్థి చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే తన అహాన్ని పక్కన పెట్టి, ఆ యువకుడిని తిరిగి పిలిచారు. ఆఫీసు సంస్కృతిని, వాతావరణాన్ని మార్చే బాధ్యతను అతడికే అప్పగించారు. పని ప్రదేశంలో నవ్వులు, పాజిటివ్ వైబ్స్ ప్రాధాన్యతను గుర్తించిన సదరు వ్యవస్థాపకుడు, ఆ యువకుడి నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాకుండా, ఆ యువకుడికి తన కంపెనీలోనే ఏకంగా హెచ్‌ఆర్ హెడ్ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Quit Job On First Day

ఆఫీసులో సంతోషకరమైన వాతావరణాన్ని కోరుకునే వ్యక్తి మాత్రమే తోటి ఉద్యోగుల క్షేమాన్ని, కంపెనీ కల్చర్‌ను సమర్థవంతంగా నిర్వహించగలడని ఆ వ్యాపారవేత్త అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హెచ్‌ఆర్ విభాగంలో పని వాతావరణం, ఎంప్లాయ్ హ్యాపీనెస్‌లకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ సంఘటన కార్పొరేట్ వర్గాల్లో విశేషంగా నిలిచింది. ఆ యువకుడి చొరవతో కేవలం మూడు నెలల్లోనే ఆఫీసు వాతావరణం పూర్తి సంతోషకరంగా మారింది. ఉద్యోగుల భాగస్వామ్యం 70శాతం పెరగడమే కాకుండా, వ్యాపార అమ్మకాలు కూడా 30శాతం పెరిగాయి.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. చాలామంది బాస్‌లు తమ అహం వల్ల ఇలాంటి విషయాలను అంగీకరించరని, కానీ అభిషేక్ నిజాయితీగా సంభాషించి మార్పుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని నెటిజన్లు ప్రశంసించారు. కార్పొరేట్ విధానాల కంటే మానవ భావోద్వేగాలకు, మంచి పని వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఏ సంస్థ విజయానికైనా మూలస్తంభమని ఈ సంఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..