
లక్నో: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడాన్ని ఇస్లాం తప్పనిసరి మత ఆచారంగా నిర్ధారించలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు స్కూల్ యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ఒక ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ సొంత యూనిఫాం నియమాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని.. మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని కాలేజీ యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హిజాబ్ ధరించడం తమ తప్పనిసరి మత ఆచారమని పిటిషన్లో పేర్కొంది. తాను 6వ తరగతి నుంచి హిజాబ్ ధరిస్తున్నానని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.
జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంది. హిజాబ్ ధరించడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద తప్పనిసరి మతపరమైన ఆచారంగా పరిగణించలేమంటూ విద్యార్థిని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఇస్లాంలో తలపాగా ధరించడం ఒక తప్పనిసరి ఆచారమని.. అది లేకపోతే ఒక వ్యక్తి విశ్వాసం ప్రభావితం అవుతుందని నిరూపించే మతపరమైన లేదా చట్టపరమైన ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ సొంత యూనిఫాం నియమాలను అమలు చేసే హక్కును కలిగి ఉన్నాయని, మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని కోర్టు పేర్కొంది.
పాఠశాల దుస్తుల విధానం ఏకరీతిగా, వివక్షారహితంగా ఉంటుందని.. విద్యార్థులు వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా మార్పులను కోరలేరని స్పష్టం చేసింది. మహిళలు తలపాగా ధరించడం ఇస్లాం మతంలో ఒక ఆవశ్యక భాగం కాదని గతంలో వివిధ హైకోర్టులు తీర్పులిచ్చాయని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.