Reading Time: < 1 minute
Konda Murali Congress Party Leaving Clarity Susmitha Controversy

Konda Murali : తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదాలు, ప్రచారాలపై సీనియర్ నాయకుడు కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబం పార్టీ మారుతోందంటూ జరుగుతున్న ప్రచారాలను ఆయన ముమ్మాటికీ ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు.

నా కూతురి ప్లాన్ బి ఏంటో నాకేం తెలుసు?

తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు, ఆమె చుట్టూ నడుస్తున్న వివాదంపై కొండా మురళి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సుస్మిత నా ఒక్కగానొక్క బిడ్డ. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా నా కూతురి వ్యవహారం. అందువల్ల ఈ వివాదంపై నేను మాట్లాడను” అని తేల్చిచెప్పారు. తన కూతురి ఆలోచనలు, ప్లాన్‌లు తనకెలా తెలుస్తాయని ప్రశ్నిస్తూ.. “ఆమె ప్లాన్-ఎ లో మాట్లాడింది, కానీ ప్లాన్-బి లో ఏం చేస్తుందో నాకేం తెలుసు? నా కూతురి ప్లాన్ నాకెలా తెలుస్తుంది?” అంటూ వ్యాఖ్యానించారు.

పార్టీ మారేది లేదు.. భట్టితో భేటీపై స్పష్టత

కాంగ్రెస్ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ మీడియా తొందరపడాల్సిన అవసరం లేదని మురళి అన్నారు. “మేము పార్టీ మారడం లేదు, మీరేం ఆత్రుత పడాల్సిన అవసరం లేదు. ఈ విషయమై ఇవాళ్టికి వరంగల్ కూడా వెళ్లలేదు” అని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన భేటీపై మాట్లాడుతూ, తాము కేవలం యోగక్షేమాలు మాట్లాడుకోవడానికే కలుసుకున్నామని, దానికి వేరే అర్థాలు తీయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.