
ఔను మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం.. మా పెళ్లికి రండి.. ఇది శుభలేఖ.. ఆ శుభలేఖ చూసినోళ్లకు షాక్.. వాళ్లిద్దరూ మహిళలు.. పోలీస్ శాఖలో పని చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు.. మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. శ్రావణమాసం శుభ ముహూర్తాన.. ఆగస్ట్ 30వ తేదీ జరగబోయే పెళ్లికి.. శుభలేఖలు కొట్టించి.. పోలీస్ శాఖలోనే అందరికీ పంచారు.. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పోలీస్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు.. మరో కేసులో ఓ మహిళా పోలీస్ అధికారిణి.. ఏకంగా శస్త్ర చికిత్స చేయించుకుని.. ఇప్పుడు మగ పోలీస్ అధికారిగా రికార్డుల్లో మార్చాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు.. ఈ రెండు వ్యవహారాలపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ జరిగింది ఎక్కడ.. ఏ రాష్ట్రంలో అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర రాష్ట్రం. మూడేళ్ల క్రితం పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది మహిళా కానిస్టేబుళ్లు ఎంపిక అయ్యారు. ఆ రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఫ్రెండ్స్ అయ్యారు. ట్రైనింగ్ లోనూ దోస్తీ మంచిగా ఉంది. ఆ తర్వాత ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోస్టింగ్ వేశారు. అక్కడి నుంచి ఇద్దరూ పూణెలోని ఓ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. రిక్రూట్ మెంట్ దగ్గర నుంచి ఇద్దరూ కలిసే ఉన్నారు.
ఈ స్నేహం ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకు వాళ్లే ముహూర్తం పెట్టుకున్నారు. రాబోయే ఆగస్ట్ 30వ తేదీన పూణెలోని ఓ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఆళందిలో పెళ్లికి రెడీ అయ్యారు. శుభలేఖ కొట్టించారు. తోటి పోలీసులకు ఆహ్వానాలు అందించారు.
ఇక్కడ అసలు ట్విస్ట్.. ఈ ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లల్లోని ఓ కుటుంబానికి ఇది అస్సలు నచ్చలేదు. పెళ్లికి అభ్యంతరం చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారులను కలిశారు. ఇద్దరు ఆడోళ్లు ఎలా పెళ్లి చేసుకుంటారు.. మీరేం చేస్తున్నారంటూ పెద్ద సీన్ క్రియేట్ చేశారు.
దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ప్రేమ, పెళ్లి అనేది వ్యక్తిగతం.. దాన్ని బలవంతంగా ఎలా ఆపగలం.. అందులోనూ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసే కానిస్టేబుళ్లు.. దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి వరకు పెళ్లి వాయిదా వేయాలని సూచించారు. ఓ వైపు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. మరో వైపు ఉన్నతాధికారుల సూచనతో ఆగస్ట్ 30వ తేదీన పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.
మహిళా కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సమయంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళల్లో.. ఓ కానిస్టేబుల్ లింగ మార్పిడి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుని.. ముంబైలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్లు బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతానికి పెళ్లి ఆగింది.. ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ తరహాలోనే మరో కేసు ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారింది. పోలీస్ అధికారిణిగా పని చేస్తున్న ఓ మహిళా పోలీస్ అధికారి.. లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారింది. దీనికి ప్రభుత్వ అనుమతి ఉంది అని ఆ మహిళా అధికారి చెబుతున్నారు. లింగ మార్పిడి తర్వాత మహిళ అని కాకుండా పురుషుడిగా రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నది. రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులకు ఉండే నిబంధనలు, రాయితీలు, నియామక నిబంధనలను ఎలా మర్చాలి అనే ప్రశ్నలతో ఇది పెండింగ్ లో పడింది..
ఈ రెండు అంశాలు ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి చూడలేదని.. వినటం, కేసుల్లో చూడటం మాత్రమే ఉందని.. ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖలోనే ఇలాంటి ప్రవర్తనలు నడుస్తుడటం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు అక్కడి పోలీసులు.