
పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు నోరూరించే మిఠాయిలు అందరి ఇళ్లల్లో కనిపిస్తాయి. అయితే ఈ స్వీట్లపై మెరిసిపోయే వెండి పూత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేవలం అందం కోసమే కాకుండా శతాబ్దాల రాచరిక సంస్కృతి, గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిలిచే ఈ వెండి రేకు వెనుక ఎంతో కళానైపుణ్యం దాగి ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఇది శాకాహారమా? తినడం సురక్షితమేనా? అనే అంశాలపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. వెండి రేకు అనేది అత్యంత స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన అతి పల్చని పొర. దీనికి ఎలాంటి ప్రత్యేక వాసన లేదా రుచి ఉండదు. చేతితో తాకితే చిట్లిపోయేంత సున్నితంగా ఉంటుంది. ఇది మిఠాయి రుచిని మార్చకుండా, దానికి రాచరిక వైభవాన్ని, పండుగ శోభను జోడిస్తుంది. కాజు కట్లీ, లడ్డూలు, పాన్, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక పదార్థాలపై దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
మిఠాయిలపై వెండి రేకు వేసే సంప్రదాయం ఎలా మొదలైంది?
ఈ సంప్రదాయం శతాబ్దాల నాటి మొఘల్ పరిపాలనా కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో రాచరిక విందులలో విలువైన లోహాల పూతలతో వంటకాలను అలంకరించేవారు. క్రమంగా భారతీయ సంస్కృతిలో వెండి పవిత్రత, శ్రేయస్సు, ఆతిథ్యానికి ప్రతీకగా మారింది. శుభకార్యాలు, పండుగల వేళ సాధారణ మిఠాయిలను సైతం ప్రత్యేక కానుకగా మార్చేందుకు ఈ వెండి పూత ఉపయోగపడింది.
ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
చాలామంది భావిస్తున్నట్లుగా వెండి రేకు వల్ల శరీరానికి ప్రత్యేక విటమిన్లు లేదా పోషకాలు అందవు. దీని ప్రధాన ఉద్దేశం దృశ్యపరమైన ఆకర్షణే. ఫుడ్ గ్రేడ్ స్వచ్ఛమైన వెండి రసాయనికంగా శరీరంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. అతి తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఇది జీర్ణవ్యవస్థ ద్వారా శోషించబడకుండా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి నాణ్యమైన స్వచ్ఛమైన వరక్ తీసుకోవడం సురక్షితమేనని నిపుణులు చెబుతున్నారు.
శాకాహార వివాదం – FSSAI నిబంధనలు
గతంలో వెండిని అత్యంత పల్చని పొరలుగా సాగదీయడానికి జంతువుల చర్మం లేదా ప్రేగుల మధ్య ఉంచి సుత్తితో కొట్టేవారు. ఈ సాంప్రదాయ తయారీ పద్ధతిపై శాఖాహారులు, జైన సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై భారత ఆహార భద్రతా ప్రామాణిక సంస్థ స్పందించి కఠిన నిబంధనలు తెచ్చింది. ఆహారంలో వాడే వెండి రేకు తయారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు సంబంధిత ఉత్పత్తులను వాడకూడదని నిషేధించింది. ప్రస్తుతం ఆధునిక, పరిశుభ్రమైన, పూర్తిగా శాకాహార మెషీన్ పద్ధతుల్లో తయారైన సర్టిఫైడ్ వెండి రేకును మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.
స్వచ్ఛమైన వెండిని ఎలా గుర్తించాలి?
కొందరు వ్యాపారులు ఖర్చులు తగ్గించుకోవడానికి విషపూరిత అల్యూమినియం ఫాయిల్ లేదా కల్తీ లోహాలను వెండి పేరుతో వాడుతుంటారు. స్వచ్ఛమైన రేకును గుర్తించే మార్గాలు..
స్పర్శ: నిజమైన వెండి రేకు కాగితం కంటే పల్చగా ఉండి, చేతితో ముట్టుకోగానే ముక్కలవుతుంది.
మెరుపు: ఒరిజినల్ రేకు సహజమైన సున్నితమైన మెరుపును కలిగి ఉంటుంది. నకిలీ అల్యూమినియం వలే అద్దంలా విపరీతంగా మెరవదు.
మంట పరీక్ష: ఒక చిన్న ముక్కను నిప్పుపై చూపిస్తే.. స్వచ్ఛమైన వెండి నల్లబడకుండా చిన్న బంతిలా మారుతుంది. అల్యూమినియం అయితే నల్లగా మారి బూడిదవుతుంది.
అందువల్ల పండుగల సీజన్‌లో పేరున్న, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన మిఠాయి దుకాణాల నుంచే స్వీట్లు కొనుగోలు చేయడం ఆరోగ్యానికి సురక్షితం.