
నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న భోటే కోశీ నది ఉధృతికి నువాకోట్, ధాదింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వరద ఉధృతికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 403 మంది టూరిస్టులు సహా 750 మందికి పైగా గల్లంతైనట్టు నేపాల్ వెల్లడించింది. టూరిస్టుల్లో 142 మంది ఇండియన్లు సహా 341 మంది విదేశీయులు, 93 మంది స్థానికులు ఉన్నారు.
నేపాల్ వరద విపత్తుకు మంచు చరియలు విరిగిపడడం, గ్లేసియల్ సరస్సు బద్ధలవడం, భూకంప ప్రభావం కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నేపాల్ వైపు నుంచి భారీగా మంచు చరియలు విరిగి లెండే ఖోలా నదిలో పడటంతో నీటి ప్రవాహం నిలిచిపోయి, ఆ తర్వాత ఒక్కసారిగా ఉప్పొంగి కిందకు దూసుకువచ్చి ఉండవచ్చని ఖాట్మండు యూనివర్సిటీ ప్రొఫెసర్ రిజన్ భక్త కాయస్థ తెలిపారు.
వరద ముంచెత్తడానికి కొద్ది నిమిషాల ముందు (ఉదయం 8:37 గంటలకు) టిబెట్ భూభాగంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించాయి.
ప్రమాదం ఎలా జరిగిందంటే..!
* ఉదయం 8:37 గంటలకు భూకంపం
* నేపాల్–టిబెట్ బార్డర్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం, రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇవి హిమాలయ పర్వతాలను కుదిపేశాయి.
* భూకంప ప్రభావంతో హిమానీనదం నుంచి భారీ స్థాయిలో మంచు, రాళ్లు విరిగిపడి ఇరుకైన ‘లెండె ఖోలా’ లోయలోకి జారాయి.
* కొండచరియలు, మంచు వ్యర్థాలు లెండె ఖోలా నదికి అడ్డంగా తాత్కాలిక డ్యామ్లా ఏర్పడి, వెనుక భారీగా నీరు చేరింది.
* నీటి ఒత్తిడి తట్టుకోలేక ఆ తాత్కాలిక మంచు డ్యామ్ తెగిపోయింది. దాంతో నీరు, మట్టి, మంచు కలగలిసి ప్రచండ వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి.
* ఉదయం 9:00 గంటలకు విధ్వంసం..
* ఈ ఉధృత ప్రవాహం భోటేకోశీ కారిడార్ గుండా ప్రవహించి రసువాగధి సరిహద్దు, తిమురే, స్యాబ్రుబేసి మీదుగా త్రిశూలి నది వైపు దూసుకెళ్లింది.
* ఈ ధాటికి పలు వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. అటు చైనా వైపు ఉన్న గైరాంగ్ పోర్ట్ ప్రాంతంలోనూ బురద ప్రవాహాలు సంభవించాయి.
ఈ లోయ ఎందుకు తీవ్ర ప్రమాదానికి గురైంది ?
* భౌగోళిక నిర్మాణం: లోయలు ఎంతో లోతుగా, ఇరుగ్గా ఉండటం వల్ల ప్రవాహం క్షణాల్లో ఉధృతంగా మారుతుంది.
* గ్లేసియర్ల అస్థిరత: పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల హిమాలయాల్లోని మంచు గడ్డలు బలహీనపడి, సులభంగా విరిగిపడుతున్నాయి.
* ముందస్తు హెచ్చరిక లేకపోవడం: స్థానికంగా వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు వరద ముప్పును ఊహించలేకపోయారు.
* గత చరిత్ర: దాదాపు 14 నెలల క్రితం ఇదే నదిలో ఇలాంటి వరదలు రావడం వల్ల తీర ప్రాంతాలు ముందే బలహీనపడి ఉన్నాయి.