Reading Time: < 1 minute
దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి..!

చిన్నపిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దగ్గు మందుల వాడకంపై కీలక నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న పిల్లలకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి వాటికి మందులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించాలని భారతదేశంలోని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కంబినేషన్ కాఫ్ సిరప్‌లను ఇవ్వకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పలు కీలక విషయాలను వెల్లడించింది.

చిన్నపిల్లలలో శ్వాసకోశ వ్యవస్థ, అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. కాంబినేషన్ కాఫ్ సిరప్‌లలో ఉండే క్లోర్‌ఫెనిరమైన్ మాలిక్యులేట్, ఫెనైల్ఎఫ్రిన్ వంటి రసాయనాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇవి చిన్నపిల్లలలో తీవ్రమైన మగత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగం పెరగడం వంటి ఉపద్రవాలకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో
తల్లిదండ్రులు వహించాల్సిన జాగ్రత్తలు కూడా వివరించారు.

పిల్లలకు దగ్గు లేదా జలుబు చేసినప్పుడు పాత ప్రిస్క్రిప్షన్లతో గానీ లేదా మెడికల్ షాప్ వారి సలహాతో గానీ కాఫ్ సిరప్‌లు కొని వాడకూడదు. మందుల సీసాపై ఉన్న పదార్థాలు, హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరిగా చదవాలి. నాలుగేళ్లలోపు పిల్లలకు ఇవి సురక్షితం కాదనే ప్రకటన ఉందో లేదో గమనించాలి. ముఖ్యంగా మందులు వాడే ముందు తప్పనిసరిగా పిల్లల వైద్యుడిని సంప్రదించి, బిడ్డ బరువు, వయస్సుకు తగిన మోతాదును మాత్రమే వాడాలి.

సాధారణ దగ్గు, జలుబు ఉన్న పిల్లలకు సిరప్‌ల కంటే ఇంట్లో పాటించే సహజ చికిత్సలు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ మార్గాన్ని శుభ్రంగా ఉంచడానికి, గొంతు ఉపశమనానికి గోరువెచ్చని నీరు లేదా పానీయాలు అందించాలి. ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు రాత్రి వేళల్లో అర చెంచా తేనె ఇవ్వడం వల్ల దగ్గు తగ్గుతుంది. ముక్కు దిబ్బడ సమస్య ఉంటే సలైన్ నాసల్ డ్రాప్స్ వాడటం లేదా తేలికపాటి ఆవిరి పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

పిల్లల విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. దగ్గు అనేది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే ఒక సహజ ప్రక్రియ. కాబట్టి, అనవసరమైన కాఫ్ సిరప్‌లను నివారించి, వైద్యుల సలహా మేరకు మాత్రమే సురక్షితమైన చికిత్స అందించడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.