Reading Time: < 1 minute
IND vs SL: టీమిండియా పాలిట విలన్ గా మారనున్న వరుణుడు.. కొలంబోలో  వాతావరణం ఎలా ఉందంటే ?

IND vs SL: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో రోజు ఆట భారీ వర్షం కారణంగా దాదాపు ఒక గంట ముందే ముగిసిపోయింది. ఒకవేళ వర్షం పడకపోయి ఉంటే మూడో రోజే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ మిగిలిన రెండు వికెట్లు పడిపోయేవి. ఒకరకంగా శ్రీలంకను మూడో రోజు ఆ వరుణుడు కాపాడాడనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీలతో భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేసింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఒక దశలో 173 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన లంకను సోనాల్ దినుషా (85 నాటౌట్) ఆదుకున్నాడు. ఇతనికి తోడుగా కేశర నువంత (18) ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శ్రీలంక ఫాలో-ఆన్ తప్పించుకోవడానికి (304 పరుగులు చేయడానికి) ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. సోనాల్ దినుషా తన వరుస రెండో టెస్టు సెంచరీకి చేరువలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Watch: జ్వరం భయం లేదట.. వర్షం చూస్తే ఆగలేడట! కొలంబోలో పంత్ ఫుల్ ఎంజాయ్‌మెంట్!

నాలుగో రోజు ఆటలో వరుణుడి పాత్ర కీలకమయ్యేలా కనిపిస్తోంది. బుధవారం కొలంబోలో మొదటి మరియు రెండో సెషన్లలో వర్షం పడే అవకాశం 50 శాతం కంటే ఎక్కువ ఉంది. చివరి మూడో సెషన్‌లో కూడా 20 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. రోజంతా ఆకాశం మబ్బుపట్టి ఉండే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఎన్ని ఓవర్లు సాగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ నాలుగో రోజు సగం ఆట వర్షార్పణమైతే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు కష్టమవుతుంది.

శ్రీలంక మ్యాచ్‌ను గెలవడం కంటే డ్రా చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోంది, ఇందులో వాతావరణం వారికి అనుకూలించవచ్చు. ఒకవేళ లంక ఫాలో-ఆన్ కాపాడుకున్నా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి 350-400 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చి శ్రీలంకను ఆలౌట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇది కూడా చదవండి: Watch Video: సిరాజ్ మాటలకు బకరా అయిన లంక బ్యాటర్.. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఔట్