Reading Time: 2 minutes
Renukaswamy Murder Case Darshan Pradosh Approver Court

Renukaswamy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సహ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు బెంగళూర్ కోర్టు అనుమతించింది. దీంతో ప్రదోష్‌ను ఇకపై నిందితుడిగా కాకుండా, ప్రాసిక్యూషన్ తరుఫున సాక్షిగా వ్యవహరించనున్నారు. బెంగళూర్ లోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (CCH) ప్రదోష్ దాఖలు చేసిన అప్రూవర్ పిటిషన్‌ను అంగీకరించింది. దీంతో ఈ హత్యకు సంబంధించిన అన్ని విషయాలను, నిజాలను నిజాయితీగా వెల్లడించాల్సిన బాధ్యత అతడిపై ఉంటుంది.

కోర్టు ప్రదోష్ వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు అతను కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించింది. అప్రూవర్‌గా మారిన తర్వాత ప్రదోష్‌కు కొన్ని షరుతులకు లోబడి ప్రయోజనాలు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. అతను నిజాలు వెల్లడించడంలో విఫలమైతే, షరతుల్ని ఉల్లంఘిస్తే అప్రూవర్ హోదా కోల్పోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అతడిని నిందితుడిగా పరిగణించే అవకాశం ఉంటుంది.

ఈ కేసులో దీనిని కీలక పరిణామంగా చూస్తున్నారు. ప్రదోష్ ఇప్పుడు సాక్షిగా మారనున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, ఇతర నిందితుల పాత్రపై అతను తెలిసిన సమాచాన్ని కోర్టుకు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో దర్శన్‌కు ఉచ్చు బిగిసే అవకాశం మరింత పెరుగుతుంది. ప్రదోష్ చెప్పే నిజాలు, ఇతర సాక్ష్యాలతో చేరితే అది ప్రాసిక్యూషన్ వాదనకు మరింత బలాన్ని ఇస్తుంది. అయితే అప్రూవర్ వాంగ్మూలం ఒక్కటే తుది తీర్పుకు నిర్ణయాత్మక ఆధారం అవుతుందని చెప్పలేం. కోర్టు అతని వాంగ్మూలాన్ని ఇతర సాక్ష్యాలు, పత్రాలు, ఫోరెన్సిక్ ఆధారాలతో కలిపి పరిశీలిస్తుంది.

2024లో రేణుకాస్వామి హత్య బెంగళూర్‌లో జరిగింది. దర్శన్ అభిమాని అయిన ఇతడిని చిత్రకూట నుంచి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు. దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పబడుతున్న పవిత్ర గౌడను ఉద్దేశిస్తూ అనుచితి వ్యాఖ్యలు చేసిన కారణంగా హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, దర్శన్‌కు ఇటీవల కోర్టు మరో షాక్ ఇచ్చింది. విచారణ సమయంలో తనను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతించాలే అభ్యర్థను కోర్టు తిరస్కరించింది. ముఖ్యంగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో తన ప్రత్యక్ష హాజరు అవసరమని ఆయన తరఫు న్యాయవాది హష్మత్ పాషా వాదించారు. ఇకపై దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.