Reading Time: < 1 minute

ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కవిత

Caption of Image.
  •     పార్టీ నాయకుడి కోరిక మేరకు ఆడపడుచుగా మారిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌
  •     ముదిరాజ్‌‌‌‌ సంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు

హైదరాబాద్, వెలుగు: వధువుకు వరుడి కంటే ముందుగా ఆడపడుచు తాళి కట్టడం కొన్ని సామాజికవర్గాల్లో, ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయం. ఇదే సంప్రదాయం ప్రకారం తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌) చీఫ్‌‌‌‌ కవిత ఓ కార్యకర్త ఇంటి ఆడబిడ్డగా మారారు. ఆ కార్యకర్త కోరిక మేరకు వధువు మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్‌‌‌‌ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ జాగృతిలోనూ ఆయన క్రియాశీలంగా పనిచేశారు. బాలప్రసాద్‌‌‌‌కు సీతాఫల్‌‌‌‌మండికి చెందిన శివానితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం ఈసీఐఎల్‌‌‌‌-కీసర క్రాస్‌‌‌‌రోడ్స్‌‌‌‌లోని ఆరాధ్య కన్వెన్షన్‌‌‌‌లో వివాహం జరిగింది. 

తనకు ఆడబిడ్డలు ఎవరూ లేరని, తన ఇంటి ఆడపడుచుగా మారి పెళ్లి జరిపించాలని బాలప్రసాద్‌‌‌‌ కవితను కోరారు. ఆయన కోరిక మేరకు కవిత ఆ ఇంటి ఆడబిడ్డగా మారారు. ముదిరాజ్‌‌‌‌ కులాచారం ప్రకారం వరుడు వధువు మెడలో తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేయిస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం కవిత ముందుగా గౌరీ పూజలో పాల్గొన్నారు. అనంతరం వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. వధువు ఉంగరపు వేలికి ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి శివానిని ఆశీర్వదించారు. అనంతరం వరుడు వధువు మెడలో తాళి కట్టి వివాహ తంతు పూర్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.