Reading Time: 2 minutes

విటమిన్ బి12 లోపం కేవలం నిరామిషాహారులకే (శాకాహారులకు) వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ రోజువారీ ఆహారంలో నాన్‌వెజ్ తింటున్నా కూడా బి12 లోపం తీవ్రంగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు మనం ఎంత తింటున్నా శరీరానికి విటమిన్ బి12 ఎందుకు అందడం లేదు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ లోపం వస్తే మన శరీరంలో కనిపించే ముందస్తు లక్షణాలు ఏంటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బాగా తిన్నా లోపం ఎందుకు వస్తుంది?: జంతు సంబంధిత ఆహారంలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. అయితే సమస్య ఆహారం తీసుకోకపోవడం కాదు, మనం తిన్న ఆహారం నుంచి బి12ను శరీరం సరిగ్గా గ్రహించలేకపోవడమే. పొట్టలోని యాసిడ్, పేగుల పనితీరు సరిగ్గా లేకపోతే మనం ఎంత నాన్‌వెజ్ తిన్నా ఆ విటమిన్ ఒంటికి పట్టదు.

పేగుల ఆరోగ్యం, సర్జరీల ప్రభావం: క్రాన్స్, సీలియాక్ వంటి పేగు సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఈ శోషణ ప్రక్రియ సరిగ్గా జరగదు. అలాగే బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారిలో చిన్నపేగు పనితీరు తగ్గి బి12 లోపం ఏర్పడుతుంది. వయసు పెరిగే కొద్దీ పొట్టలో యాసిడ్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది.

Eating Meat But Still Low on Vitamin B12? Here’s Why
Eating Meat But Still Low on Vitamin B12? Here’s Why

డయాబెటిస్, గ్యాస్ మందుల వాడకం: టైప్-2 డయాబెటిస్ కోసం వాడే మెట్‌ఫార్మిన్ మందులు, గ్యాస్ లేదా ఎసిడిటీ కోసం దీర్ఘకాలంగా వాడే టాబ్లెట్స్ వల్ల బి12 స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. ఇక వీటితో పాటు అధికంగా మద్యం సేవించడం కూడా శరీరం బి12ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

లక్షణాలు తీవ్రమైతే ప్రమాదమే: ప్రారంభంలో నిరంతర అలసట, బలహీనత, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు వంటివి కనిపిస్తాయి. నాడీ వ్యవస్థకు బి12 చాలా అవసరం. అందుకే లోపం ఎక్కువైతే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం, నడవలేకపోవడం లాంటి తీవ్రమైన నరాల సమస్యలొస్తాయి.

ఇక మంచి ఆహారం తీసుకోవడమే కాదు, అది శరీరానికి సరిగ్గా పడుతుందో లేదో గమనించుకోవడం చాలా ముఖ్యం. బి12 లోపాన్ని ప్రారంభంలోనే గుర్తిస్తే నరాలు శాశ్వతంగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

గమనిక: అలసట, కాళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. సొంతంగా మందులు వాడకూడదు.

The post చికెన్, మటన్ తింటున్నా B12 లోపం ఎందుకు వస్తుంది? appeared first on Manalokam – Latest Telugu News & Updates.