Reading Time: 3 minutes
Egg Prices Rise How Ethanol Demand Is Driving Corn Costs

Egg Prices Rise: వెంకీ పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఇదేనేమో.. నిత్యావసర ఆహార పదార్థాల ధరలు సామాన్యులపై భారాన్ని పెంచుతున్నాయి. చక్కెర, ఇతర ఆహార వస్తువుల తర్వాత ఇప్పుడు గుడ్ల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు సుమారు 35-40 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాల్లో కోళ్ల మేత ధరలు పెరగడం ఒకటి. ముఖ్యంగా కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడం మేత ఖర్చులపై ఒత్తిడి పెంచుతోంది.

గుడ్డు ధర ఎంతకు చేరింది?

జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) ప్రకారం పౌల్ట్రీ ఫారంలో ఒక గుడ్డు ధర సుమారు ₹7కు చేరింది. రిటైల్ మార్కెట్లలో మాత్రం ఒక్కో గుడ్డు ₹8.50 నుంచి ₹9 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఏడాది వ్యవధిలో ధరలు 35-40 శాతం మేర పెరగడం వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి కూడా గుడ్ల ధరల్లో తేడాలున్నాయి.. అయితే, గుడ్ల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, కోళ్ల మేత ఖర్చు కీలక పాత్ర పోషిస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమలో మొత్తం ఉత్పత్తి వ్యయంలో మేతకు పెద్ద వాటా ఉంటుంది. మేతలో ఉపయోగించే మొక్కజొన్న, సోయాబీన్ వంటి ముడి పదార్థాల ధరల్లో మార్పులు నేరుగా కోళ్ల పెంపకం ఖర్చుపై ప్రభావం చూపుతాయి.

ఇథనాల్‌కు మొక్కజొన్నకు సంబంధం ఏంటి?

భారతదేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం పెంచాలన్న విధానం కారణంగా ఇథనాల్ ఉత్పత్తికి ధాన్యాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో మొక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన ముడి పదార్థంగా మారింది. ఇథనాల్ ప్లాంట్లకు అవసరమైన మొక్కజొన్న లభ్యతను పెంచడంతో పాటు, ప్లాంట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కజొన్న సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ESY 2025-26లో ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 12.578 మిలియన్ టన్నుల మొక్కజొన్న వినియోగం అవుతుందని అంచనా. ఇథనాల్ రంగంలో మొక్కజొన్నకు పెరుగుతున్న డిమాండ్ ఎంత వేగంగా ఉందో ఇది సూచిస్తోంది.

ఆర్థిక సర్వేలోనూ ఇదే అంశం
2025-26 ఆర్థిక సర్వే కూడా ఇథనాల్ కోసం మొక్కజొన్నకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రస్తావించింది. ఇథనాల్ పరిశ్రమలో మొక్కజొన్నకు డిమాండ్ పెరగడం దాని ధరలతో పాటు రైతుల సాగు నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది. 2022-25 ఆర్థిక సంవత్సరాల మధ్య మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ నియంత్రిత ధర ఏటా సగటున 11.7 శాతం పెరిగింది. దీంతో రైతులకు మొక్కజొన్న సాగు మరింత ఆకర్షణీయంగా మారింది. ఫలితంగా ఇథనాల్ పరిశ్రమ మాత్రమే కాకుండా పౌల్ట్రీ, పశువుల దాణా రంగాల అవసరాలు కూడా ఒకే ముడి పదార్థంపై పోటీ పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది.

మొక్కజొన్న ధర పెరిగితే కోళ్ల మేతపై ప్రభావం
మొక్కజొన్న పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన పదార్థం. కాబట్టి దాని ధర పెరిగినప్పుడు కోళ్ల మేత ఖర్చు కూడా పెరుగుతుంది. మరోవైపు సోయాబీన్ వంటి ఇతర ముడి పదార్థాల ధరలు, వాతావరణ పరిస్థితులు, పంట దిగుబడులు కూడా మేత ధరలను ప్రభావితం చేస్తాయి. ఇథనాల్ పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ రెండింటి నుంచి మొక్కజొన్నకు డిమాండ్ పెరిగినప్పుడు సరఫరాపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో మొక్కజొన్న ధరలు పెరిగి, చివరకు కోళ్ల పెంపకం ఖర్చు పెరుగుతుంది. ఈ అదనపు వ్యయం గుడ్ల ధరల్లో కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది.

గుడ్ల ధరల పెరుగుదలకు ఇథనాల్ ఒక్కటే కారణమా?
అయితే ప్రస్తుతం గుడ్ల ధరలు పెరగడానికి ఇథనాల్ డిమాండ్ ఒక్కటే కారణమని చెప్పడం సరికాదు. మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి పెరుగుతున్న డిమాండ్ ఒక ముఖ్యమైన అంశమే అయినప్పటికీ, పౌల్ట్రీ ఫీడ్‌కు పెరుగుతున్న డిమాండ్, వాతావరణ పరిస్థితులు, కోళ్ల ఉత్పాదకతలో మార్పులు, ఇతర మేత ముడి పదార్థాల ధరలు, గుడ్ల సరఫరా వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల గుడ్ల ధరల ప్రస్తుత పెరుగుదలను ఒకే కారణంతో వివరించలేం. ఇథనాల్ కోసం మొక్కజొన్న వినియోగం పెరగడం మాత్రం పౌల్ట్రీ రంగానికి అదనపు వ్యయ సవాలుగా మారుతోంది.

మొక్కజొన్నను దిగుమతి చేసుకుంటున్న భారత్
దేశీయంగా మొక్కజొన్నకు డిమాండ్ పెరగడంతో భారతదేశం దిగుమతులపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024లో భారత్ సుమారు 8.9 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకుంది. మయన్మార్, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి గణనీయమైన పరిమాణంలో మొక్కజొన్న భారత్‌కు వచ్చింది. 2024-25లో కూడా మొక్కజొన్న దిగుమతులు పెరిగినట్లు సమాచారం. గతంలో మొక్కజొన్నను ఎగుమతి చేసే భారత్ ఇప్పుడు పశువుల మేత, ఇథనాల్, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చాల్సి వస్తోంది. దీంతో దేశీయ సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది.

దేశంలో మొక్కజొన్న ఉత్పత్తి కూడా పెరుగుతోంది
మరోవైపు దేశంలో మొక్కజొన్న ఉత్పత్తి కూడా పెరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25లో భారతదేశ మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 43.4 మిలియన్ టన్నులకు చేరినట్లు సమాచారం. ఇథనాల్, పశువుల దాణా రంగాల నుంచి భవిష్యత్తులో మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉండటంతో మొక్కజొన్న ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇథనాల్ ప్లాంట్ల అవసరాలు, పౌల్ట్రీ రంగం మేత అవసరాలు రెండింటినీ సమతుల్యం చేయడం కీలకంగా మారింది.

శీతాకాలంలో గుడ్ల ధరలు మరింత పెరుగుతాయా?
గుడ్లకు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నప్పటికీ సాధారణంగా శీతాకాలంలో వినియోగం పెరుగుతుంది. ఇప్పటికే మొక్కజొన్న, పౌల్ట్రీ ఫీడ్ ధరలు అధికంగా ఉన్న సమయంలో గుడ్లకు డిమాండ్ మరింత పెరిగితే ధరలపై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయితే శీతాకాలంలో గుడ్ల ధరలు ఎంత మేరకు పెరుగుతాయనేది కేవలం మొక్కజొన్న ధరలపై ఆధారపడి ఉండదు. కోళ్ల ఉత్పాదకత, వాతావరణ పరిస్థితులు, ఇతర మేత ఖర్చులు, మార్కెట్లో గుడ్ల సరఫరా, వినియోగదారుల డిమాండ్ వంటి అంశాలు కూడా కీలకంగా ఉంటాయి.

ఇథనాల్‌కు లాభం.. పౌల్ట్రీ రంగానికి సవాలు
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వల్ల చమురు దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగం పెరగడం వల్ల వ్యవసాయ ముడి పదార్థాలపై పోటీ పెరుగుతోంది. ఒకవైపు ఇథనాల్ రంగానికి మొక్కజొన్న అవసరం పెరుగుతుండగా, మరోవైపు పౌల్ట్రీ, పశువుల దాణా రంగాలకు కూడా అదే మొక్కజొన్న అవసరం. ఈ డిమాండ్ల మధ్య సమతుల్యత లేకపోతే మొక్కజొన్న ధరలు, మేత ఖర్చులు, చివరకు గుడ్ల ధరలపై ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, గుడ్ల ధరల ప్రస్తుత పెరుగుదల వెనుక ఇథనాల్ కోసం పెరుగుతున్న మొక్కజొన్న డిమాండ్ ఒక ముఖ్యమైన కారణం. కానీ అదే ఒక్క కారణం కాదు. దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిని పెంచడం, దిగుబడిని మెరుగుపరచడం, ఇథనాల్ మరియు పౌల్ట్రీ రంగాల ముడి పదార్థాల అవసరాలను సమతుల్యం చేయడం ద్వారా భవిష్యత్తులో ధరలపై ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుంది.