
ఏపీ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కంప్లెక్స్ లోని శాసనసభ భవన నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తుశిల్పం -తెలుగు సంస్కృతీ సమ్మేళనంగా రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా బుధవారం ( ఆగస్టు 26 ) రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధుల బృందంతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఏపీ శాసన వ్యవస్థ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ భవనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన చేయడంపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక వాస్తుశిల్ప సౌందర్యంతో పాటు, భవనం వినియోగించే ప్రతి వర్గానికి సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
శాసనసభ సముదాయంలో సీఎం ఛాంబర్, స్పీకర్ ఛాంబర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ కార్యాలయం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశ మందిరం, మంత్రులు మరియు శాసనసభ్యుల కార్యాలయాలు, వివిధ శాసనసభ కమిటీల సమావేశ మందిరాలు తదితర విభాగాలను సమగ్రంగా ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు.
అసెంబ్లీ హాలు, కమిటీ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్స్, శాసనసభ్యుల లాబీలు, ప్రోటోకాల్ ప్రాంతాలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, మీడియా వర్క్‌స్టేషన్లు, మీడియా బ్రీఫింగ్ సదుపాయాలు, సందర్శకుల గ్యాలరీలు, పబ్లిక్ లాంజ్‌లు, విజిటర్స్ రిసెప్షన్ ప్రాంతాలు వంటి కీలక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంపై ప్రతినిధులతో చర్చించారు.
అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, శాసనసభ భవనం కేవలం పరిపాలనా నిర్మాణంగా కాకుండా రాష్ట్ర ప్రజాస్వామ్య స్ఫూర్తికి, తెలుగు సంస్కృతి–వారసత్వానికి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలకు చిరస్థాయి ప్రతీకగా నిలిచేలా నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో దృష్టి సారించారు.
ప్రజాస్వామ్యానికి ప్రతీకగా… తెలుగు సంస్కృతికి అద్దంగా… ఆధునిక ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చిరునామాగా… అమరావతి శాసనసభ భవనం రూపుదిద్దుకునేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు మంత్రులు, అధికారులు.