Reading Time: 2 minutes
Andhra News: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు.. చివరకు

అమ్మాయి విషయంలో మొదలైన గొడవ కారణంగా ఓ యువకుడు ప్రాణ స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సతీష్ రెడ్డి, సాయికిరణ్‌ ఇద్దరూ స్నేహితులు. వీళ్లిద్దరికి 8 ఏళ్ల స్నేహ బంధం. సతీష్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవలే అతను వివాహం కూడా చేసుకున్నాడు. అయితే సాయి కిరణ్ గత కొన్ని రోజులుగా ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు.. ఆ విషయం సతీష్ రెడ్డికి కూడా తెలుసు.

అయితే గత కొద్ది రోజులుగా సాయికిరణ్‌కు తన ప్రియురాలికి గ్యాప్ వచ్చింది. దీంతో సతీషే తన గురించి ఆమెతో లేనిపోనివి చెప్తున్నాడనే అనుమానం సాయికిరణ్‌కు మొదలైంది. ఇదే విషయంలో గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే సడెన్‌గా శనివారం రాత్రి నీతో మాట్లాడేది ఉందని.. కలుద్దామని సతీష్‌కు ఫోన్ చేశాడు సాయికిరణ్‌. దీంతో సతీష్‌ ఒక్కడే సాయిని కలిసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే సాయి మద్యం మత్తులో ఉండడంతో అమ్మాయి విషయంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇద్దరూ ఒకరినొకరు బాగా కొట్టుకున్నారు.

అయితే సతీష్‌పై దాడికి ముందే ప్లాన్‌ చేసిన సాయి.. అప్పటికే అక్కడికి తన ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి సతీష్‌పై దాడికి దిగారు. అయితే సతీష్‌ రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తుండడంతో తన బలంతో వారిని కాసేపు ఆపగలిగాడు. కానీ ఒక్కడే కావడంతో నలుగురితో పోరాడలేకపోయాడు. చివరకు నలుగురూ కలిసి సతీష్‌ను ఇష్టం వచ్చినట్లు కొట్టి పక్కనే ఉన్న ఓ చెక్క తీసుకొని అతని గొంతులో పొడిచేశారు. దీంతో సతీష్‌ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సాయి కిరణ్, అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోయారు.

అయితే రక్తపు మడుగులో ఉన్న సతీష్‌ రెడ్డిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే సతీష్‌ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన సతీష్‌ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లైన ఏడాదికే.. అది కూడా తను గర్భవతిగా ఉన్నప్పుడే భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతని భార్య గుండెలు అవిసేలా రోదిస్తోంది. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. ఎన్నో ప్లాన్స్ చేసుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్తను కోల్పోయిన ఆమె దుఃఖాన్ని చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కేవలం అనుమానంతో క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయంతో.. 8 ఏళ్ల స్నేహ బంధాన్ని దూరం చేసుకున్నాడు సాయి కిరణ్‌.. అంతేకాదు నిన్న మొన్న పరిచయమైన ఓ అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఓ భార్యకు భర్తను దూరం చేశాడు.. ఓ తల్లికి కొడుకును దూరం చేశాడు.. అమ్మ గర్భంలో నుంచి బయటకు కూడా రాని ఓ బిడ్డకు తండ్రిని దూరం చేశాడు. వీటన్నింటికీ కేవలం ఒక్క మద్యం మత్తే కారణమని స్థానికులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.