
ప్రేమ పేరుతో వల విసిరి.. మతమార్పిడే లక్ష్యంగా జరిగే కుట్రనే లవ్ జిహాద్‌గా భావిస్తున్నారు. గతంలో ఉత్తరాదికి పరిమితమైన లవ్ జిహాద్. ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించిందనే వాదన వినిపిస్తోంది. కాకినాడ సౌజన్య కేసులో లవ్ జిహాద్ కోణం బయటపడటం కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్ బలపడుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు అదో విషాదం. కానీ సౌజన్య సూసైడ్ లెటర్ దొరికిన తర్వాత.. విషాదం కాస్తా.. కుట్ర, వేధింపుల కేసుగా మలుపు తిరిగింది. ఇప్పుడు ఏకంగా సౌజన్య లేఖలో రాసిన కొన్ని వివరాలు చూస్తే.. అసలు విషయం లవ్ జిహాద్ అయ్యుంటుందా అనే అనుమానం బలపడుతోంది.
లవ్ జిహాద్ ను ప్రధానంగా హిందూ లేదా ఇతర ముస్లిమేతర వర్గాలకు చెందిన యువతులను ప్రేమ పేరుతో ముస్లిం యువకులు మతం మార్పిడి చేయడాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర అని కొందరు వాదిస్తుండగా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. హిందూ జనాభాను తగ్గించడానికి ముస్లిం జనాభాను పెంచడానికి ఇది ఒక ప్రణాళికాబద్ధమైన చర్య నిఅ కొన్ని వర్గాలు వాదిస్తాయి. దీని వెనుక విదేశీ నిధులు, ఉగ్రవాద సంస్థల హస్తం ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన ది కేరళ స్టోరి సినిమాతో లవ్ జిహాద్ చర్చ కాస్తా రచ్చగా మారింది. కేరళ నుండి కొంతమంది యువతులు మతం మారి, తమ భర్తలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు వెళ్లి ISIS ఉగ్రవాద సంస్థలో చేరడం ఈ వివాదానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. ఇది కేవలం మత మార్పిడి మాత్రమే కాదని, దీని వెనుక ఉగ్రవాద కుట్ర ఉందనే అనుమానాలను బలపరిచింది. ది కేరళ స్టోరీ అనే సినిమా కూడా ఈ అంశం చుట్టూనే నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా ది కేరళ స్టోరి పార్ట్ 2 కూడా వచ్చింది. దీనిపైనా చాలా రాద్దాంతం జరిగింది. అంతకుముందే ఉత్తరాది రాష్ట్రాల్లో అడపాదడపా లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రుజువయ్యాయి. మరికొన్ని కేవలం అపోహలుగా మిగిలిపోయాయి.
లవ్ జిహాద్‌లో యువతులకు ఇష్టాన్ని కష్టంగా తెప్పించి మరీ పెళ్ళి ఉచ్చులోకి లాగుతున్నారనీ, మతమార్పిడే ధ్యేయంగా ఇదంతా జరుగుతోందని కొందరు గట్టిగానే వాదిస్తున్నారు. మత వ్యాప్తే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. లవ్ జిహాద్ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయనేందుకు కూడా గతంలో కొన్ని ఆధారాలు వెల్లడయ్యాయి. లవ్ జిహాద్ వ్యవహారాన్ని అంతర్జాతీయంగా ముస్లిం యూత్ ఫోరం సమన్వయపరుస్తోందనే ఆరోపణలున్నాయి. ఇలా లవ్ జిహాద్ కు మన దేశంలోనూ చాలా చరిత్ర ఉందంటాయి కొన్ని వర్గాలు. ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. అయితే లవ్ జిహాద్ క్రమంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరిస్తోందనే అనుమానాల్ని బలపరిచేలా.. ఇప్పుడు కాకినాడ సౌజన్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మొన్నటివరకు ఆత్మహత్య.. తర్వాత వేధింపుల ఆరోపణలు మాత్రమే ఉన్న కేసు కాస్తా.. ఇప్పుడు సౌజన్య తనను ఇస్లాంలోకి మారాలని సాదిక్ బలవంతం చేశాడన్న లేఖతో లవ్ జిహాద్ కోణం వెలుగుచూసింది. చివరకు కేసు వివరాలు చెప్పిన ఎస్పీ కూడా ఈ కోణంపైనా విచారణ చేస్తున్నామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటి వరకూ లవ్ జిహాద్ సంఘటనలు పెద్దగా నమోదు కాలేదు. అయితే, హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల పర మతస్తులైన యువతుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రేమ వివాహాలకు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని, ధర్మరక్షాసమితి వంటి సంస్థలు దీనిపై ఫిర్యాదులు చేస్తున్నాయ్. మతమార్పిడే లక్ష్యంగా చేసుకుని ప్రేమలోకి దించి పెళ్ళి ఉచ్చులో బిగించే చర్యలు ఎక్కడ జరిగినా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నదే ఎక్కువమంది ఎక్కువ మంది అభిప్రాయం.ఇలాంటి తరుణంలో కాకినాడ సౌజన్య లేఖలో లవ్ జిహాద్ కోణం వెలుగుచూడటం.. ఇప్పుడు మొత్తంగా కేసు కొత్త మలుపు తిరిగింది.
మతమే సున్నితమైన అంశం. ఇందులో లవ్ జిహాద్‌వంటి పోకడలు విద్వేషాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అగ్నికి ఆజ్యంపోసినట్లు కొందరు నేతలు అప్పుడే సున్నితమైన ఈ అంశాన్ని తమ వ్యాఖ్యలతో మరింత వివాదాస్పదం చేస్తున్నారు. ఆయుధం పట్టకుండా.. రక్తం చిందకుండా..మతం ముసుగులో కొందరు సాగిస్తున్న సరికొత్త ఉగ్రవాదమిది. దీనికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, శ్రీరాంసేన, క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ యాక్షన్, క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ పనిచేస్తున్నాయ్. ఆదిలోనే అడ్డుకోకపోతే లవ్‌జిహాద్ పేట్రేగిపోతుందనే అనుమానం చాలామందిలో ఉంది. ఇప్పటికే దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న లవ్ జిహాద్‌కు అడ్డుకట్ట వేయకపోతే మరింత ప్రమాదం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో లవ్ జిహాద్ పేరుతో ప్రతి కేసునూ భూతద్దంలో పెట్టి చూడకూడదని, అలాగే ఆరోపణలు రాగానే లవ్ జిహాద్ అని ఫిక్సైపోకుండా.. సరైన విచారణ తర్వాతే నిర్ధారించుకోవాలనే అభిప్రాయాలూ లేకపోలేదు.
మామూలుగానే మతం సున్నితమైన అంశం. దీనికి తోడు ప్రేమ, పెళ్లి.. అనేవి వ్యక్తిగతం. ప్రతి అంశంలోనూ కచ్చితంగా లక్ష్మణరేఖలుంటాయి. ఇక్కడ పోలీసులైనా, కోర్టులైనా బలమైన క్లూలు లేకుండా ఓ పరిధి దాటి విచారణ చేయడం కాస్త కష్టమవుతుంది. కొన్నిసార్లు క్లూ దొరికినా.. ఆధారాలు లేకపోతే కేసులో ఏమీ తేలకుండా పోవచ్చు. ఉత్తరాదిన కొన్ని లవ్ జిహాద్ కేసులు అలాగే మూతపడ్డాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతమాత్రాన ప్రతి కేసూ అలాగే ఉండాలని లేదు. ప్రస్తుతం కాకినాడ సౌజన్య కేసులో ఎలాగూ సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. అన్ని కోణాల్లోనూ విచారిస్తారు కాబట్టి.. లవ్ జిహాద్ కోణం రుజువైతే ఎటూ శిక్ష పడుతుంది. కాకపోతే ఈ కేసును కేస్ స్టడీగా తీసుకుని.. తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్‌పై కన్నేసి ఉంచాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది.