Reading Time: < 1 minute

ఇంటర్, డిగ్రీ చదివి 30 ఏళ్లుగా డాక్టర్లుగా చెలామణి..  హైదరాబాద్ లో ఇద్దరు నకిలీ డాక్టర్లు అరెస్ట్

Caption of Image.

ఎటువంటి వైద్య విద్యార్హతలు లేకుండా  సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ బస్తీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాణికేశ్వర్ నగర్‌లో గత కొంతకాలంగా శివరాత్రి లింగయ్య మూర్తి సూర్య పాలిక్లినిక్ పేరుతో ఒకరు, అలాగే చింతలూరి రమేష్ సరోజన పాలిక్లినిక్ పేరుతో మరొకరు క్లినిక్‌లు నిర్వహిస్తూ అమాయక ప్రజలకు వైద్యం అందిస్తున్నారు.

అయితే, ఈ నకిలీ డాక్టర్ల చదువులు, వారి నేపథ్యం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే! ఒక సీనియర్ నకిలీ డాక్టర్ కేవలం ఇంటర్మీడియట్ చదివి.. గత 30 సంవత్సరాలుగా ప్రజలకు వైద్యం చేస్తూ వస్తున్నాడు. మరో యంగ్ నకిలీ డాక్టర్ కేవలం బీఏ (BA) చదివి.. గత మూడేళ్లుగా డాక్టర్లా చెలామణి అవుతూ రోగులకు వైద్యం అందిస్తున్నాడు. అర్హత లేని వీరు ఇష్టానుసారంగా మందులు ఇస్తుండటంతో బస్తీ ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది.

గత కొంతకాలంగా నగర వ్యాప్తంగా నకిలీ వైద్యులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. సోమవారం రాత్రి మాణికేశ్వరి నగర్‌లోని ఈ క్లినిక్‌లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. క్లినిక్‌లలో ఎలాంటి అర్హత పత్రాలు లేవని గుర్తించి, ఆ ఇద్దరు నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు, వారి క్లినిక్‌ల నుండి పెద్ద ఎత్తున మెడిసిన్స్, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనారోగ్యం వస్తే కేవలం గుర్తింపు పొందిన అర్హులైన డాక్టర్ల వద్దే చికిత్స తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.