
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని జగన్ సూచించారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కాదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన ఎన్నికలని అన్నారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, దౌర్జన్యాలు ఎదురైనా నాయకుడు తమ వెంట ఉన్నాడనే భరోసా కార్యకర్తలకు కల్పించాలని సూచించారు. పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు..
ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ వంటి కీలక పదవులకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను కూడా పోటీలోకి దింపడానికి వెనుకాడవద్దని అన్నారు. ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలు జరిగేందుకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కో-ఆర్డినేటర్లు పార్టీ అభ్యర్థులుగా ఉండరని తెలిపారు. ఎన్నికల అనంతరం అభ్యర్థులను ఎక్కడెక్కడ నిలబెట్టారు, వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారనే అంశాలపై నివేదికలు తీసుకుంటానని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఒక్కో ఓటు కూడా కీలకమని, తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. “గెలుపే ముఖ్యం.. గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం తీసుకురావాలని జగన్ సూచించారు. రాబోయే 60 నుంచి 70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా స్థానిక ఎన్నికలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని అన్నారు. ఇంటింటి ప్రచారం ద్వారా వైఎస్సార్‌సీపీ పాలన, కూటమి పాలన మధ్య ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పోలీసు అధికారులు తమ పదవులను దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జగన్ కోరారు. కార్యకర్తలను వేధించే లేదా అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..