Reading Time: < 1 minute
Bhote Koshi River Nepal Bihar Kosi River Flood

Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి నది విధ్వంసం సృష్టించింది. హఠాత్తుగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ రుసువా జిల్లా అతలాకుతలమైంది. ఇప్పటి వరకు వందలాది మంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి రోడ్లు, గ్రామాలు కొట్టుకుపోయాయి. 10కి పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ నది టిబెటన్ హిమాలయ ప్రాంతంలో ఉద్భవించి, నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్ మరియు రసువా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. నేపాలీలో “భోటే” అంటే టిబెటన్ అని అర్థం. అంటే ఇది టిబెట్‌లో ఉద్భవించిన కోషి నది యొక్క ఉపనది. తర్వాత భోటేకోషి నది సుంకోషి నదిలో కలుస్తుంది. సుంకోషి, అరుణ్, తమూర్ తదితర నదులు కలిసి చివరకు కోషి నదీ వ్యవస్థగా మారి భారతదేశంలోని బీహార్‌లోకి ప్రవహిస్తుంది.

నేపాల్‌లో విలయం సృష్టించిన అదే నది బీహార్‌లోకి..

ఇదిలా ఉంటే, నేపాల్ వరదలు భారతదేశంలో భయాన్ని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచిఉంది. నేపాల్ వరదలకు కారణమైన భోటేకోశి నది టిబెట్‌లో పుట్టి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తుంది. బీహార్‌లో దీనిని కోసి నదిగా పిలుస్తారు. కోసి నదిని ‘‘బీహార్ దుఃఖదాయిని’’గా పిలుస్తారు. ఈ నది కారణంగా బీహార్ ప్రాంతంలో తరుచుగా వరదలు రావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.

బీహార్‌, యూపీల్లో ప్రభుత్వం అప్రమత్తం..

నేపాల్ వరదల నేపథ్యంలో బీహర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేపాల్ నుంచి భారత మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే నదుల్లో గండక్(నారాయణి), కోసి నదుల ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చైదరి మాట్లాడుతూ.. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎస్, డీజీపీలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాలకు తానే వెళ్తానని చెప్పారు. నదీ ప్రవాహక ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలను అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గండక్, నారాయణి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది.