Reading Time: 2 minutes

GIVA Ad Controversy: కృతి సనన్ రాఖీపై దుమారం.. చివరకు యాడ్‌ను తొలగించిన గీవా!

Caption of Image.

రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, రక్షణకు ప్రతీక. కానీ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గీవా’ రాఖీ యాడ్ మాత్రం ఈ పండుగకు ముందే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. కృతి ధరించిన బ్రాలెట్‌ తరహా బ్లౌజ్, కేప్‌, డ్రేప్డ్ స్కర్ట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ యాడ్‌లో కృతి ఓ కుక్కకు రాఖీ కట్టడం మరో వివాదానికి దారితీసింది.  సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా మరింత హీట్ పెంచేసింది.

రాఖీ యాడ్ పై దుమారం..

వివాదంలోకి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత ముదిరింది. యాడ్ లో కృతి వస్త్రధారణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఈ ప్రచారాన్ని ఆమె ఇంటెన్షనల్లీ క్రీపీ గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ రోజుల్లో మహిళలకు లెహంగా చోళీల నుంచి జీన్స్ వరకు, చీరల నుంచి బికినీల వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కానీ మీ సోదరుడికి బికినీ తలపించే దుస్తులలో వెళ్లి రాఖీ కట్టడం ఏమిటి? మీ స్టైలింగ్ ఆప్షన్లన్నీ ఎక్కడికి పోయాయి? ఈ యాడ్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుంది. అసహ్యంగా కనిపిస్తోంది అని కంగన అభిప్రాయపడ్డారు.   దీంతో అప్పటికే సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ ఒక్కసారిగా రాజకీయ రంగు కూడా పులుముకుంది. 

ట్రోల్ చేయడం మానండి.. 

అటు రాహుల్ గాంధీ కూడా ఈ యాడ్ పై రియాక్ట్ అయ్యారు. ఒక మహిళ ఏమి ధరిస్తుంది, ఏమి చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది  ఆమె స్వేచ్ఛ. ఈ విషయంలో మహిళలను ట్రోల్ చేయడం మానండి అని పేర్కొన్నారు. మహిళల దుస్తులు, జీవనశైలి ఎంపికలపై ఆన్‌లైన్‌లో పోలీసింగ్ జరగకూడదని ఆయన సూచించారు.

కృతి కౌంటర్..

అయితే విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించింది. పండుగల అసలు సారం మనం ధరించే దుస్తుల్లో కాదని, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు, సంప్రదాయాల్లో ఉందని ఆమె పేర్కొంది. తమ కుటుంబంలో రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెళ్లు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటారని, తమ కుక్కలను కూడా కుటుంబ సభ్యులుగానే భావిస్తామని చెప్పింది. అంతేకాదు, మహిళ సంస్కృతిని ఆమె దుస్తులతోనే ఎందుకు కొలవాలంటూ ప్రశ్నించింది. కల్చర్‌, ట్రెడిషన్స్ మనసులో ఉంటాయి.. నెక్‌లైన్‌లో కాదు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది కృతి..

యాడ్‌ను తొలగించిన గీవా…

లేటెస్ట్ గా గీవా కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద యాడ్‌ను అన్ని మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను తాము అత్యంత గౌరవిస్తామని, ఎవరి మనోభావాలనైనా అనుకోకుండా గాయపరిచి ఉంటే క్షమించాలని తెలిపింది.  ఎప్పుడూ కుటుంబ సభ్యులందిరితో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాడాన్ని నమ్మే మాబ్రాండ్ .. ఈ సారి ఆ ఆనందాన్ని పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ను రూపొందిచాము .. కానీ ఎవరి మనోభావాలను గాయపరచాలనేది మా ఉద్దేశం కాదు. అందరి మనోభావాలను , నమ్మకలను గౌరవిస్తూ.. ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నాము అని సంస్ధ స్పష్టం చేసింది.

 

ఇదే ఇప్పుడు మరో ప్రశ్నకు తెరతీసింది సోషల్ మీడియా ఒత్తిడి పెరిగితే బ్రాండ్లు తమ క్రియేటివ్ స్వేచ్ఛను ఎంతవరకు కాపాడుకోగలవు? గతంలోనూ సాంస్కృతిక, మత, రాజకీయ వివాదాల కారణంగా పలు ప్రముఖ బ్రాండ్లు తమ ప్రకటనలను వెనక్కి తీసుకున్నాయి. ఇప్పుడు గీవా కూడా ఆ జాబితాలో చేరింది. యాడ్ పోయినా.. దాని చుట్టూ రేగిన రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.