Reading Time: < 1 minute

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు: 250కి పైగా విమానాలు ఆలస్యం..15 విమానాలు దారి మళ్లింపు!

Caption of Image.

ఉత్తరాదిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా  దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆగస్టు 24 న ఉదయం నుంచి వీచిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రోడ్లపై భారీగా నిలిచిన ట్రాఫిక్, వాహనాల రాకపోకలకు అంతరాయంనాయ్డా, ఘాజియాబాద్, గురుగ్రామ్ ,  ఫరీదాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంగం విహార్, ఎన్‌హెచ్-9 (NH-9) అండర్‌పాస్ వంటి ప్రధాన ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా నిలవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. 250 కి పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తుండగా..  సుమారు 15 విమానాలను జైపూర్, చండీగఢ్ , లక్నో ప్రాంతాలకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.   వీటిలో 12 విమానాలను జైపూర్‌కు, రెండు చండీగఢ్‌కు, ఒక విమానాన్ని లక్నోకు దారి మళ్లించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రెడ్/ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కేవలం ఢిల్లీలోనే కాకుండా ఉత్తరాఖండ్, ఒడిశా,తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  

 

©️ VIL Media Pvt Ltd.