
- యూపీ స్టూడెంట్ పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు
ప్రయాగ్‌రాజ్: స్కూల్ నిర్దేశించిన యూనిఫామ్‌కు బదులుగా హిజాబ్ వేసుకునే హక్కు విద్యార్థులకు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారం కాదని పేర్కొంది. స్కూల్ మేనేజ్‌మెంట్ సూచించిన డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు యూపీకి చెందిన స్టూడెంట్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న బాలిక హైస్కూల్ పూర్తి చేసి అదే స్కూల్‌లో 11వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే, స్కూల్ యూనిఫామ్‌తోపాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని తన తల్లి ద్వారా ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.
తాను ఆరో తరగతి నుంచే హిజాబ్ ధరిస్తున్నానని, అది ఇస్లాం మతంలో ముఖ్యమైన ఆచారమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
- ప్రైవేట్ స్కూళ్లు డ్రెస్ కోడ్ అమలు చేస్కోవచ్చు..
స్టూడెంట్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ బెంచ్.. స్కూల్‌కు సంబంధించిన తరగతుల ఫొటోలను పరిశీలించింది. పిటిషనర్ మినహా అదే మతానికి చెందిన ఇతర బాలికలు ఎవరూ హిజాబ్ వేసుకోవట్లేదని నిర్ధారించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మతపరమైన ఆచారం అనే వాదనకు ఆధారం లేదని కోర్టు తెలిపింది. హిజాబ్ వేసుకోకపోతే ఇస్లాం నమ్మకానికి ముప్పు ఏర్పడుతుందనే స్థాయిలో ఆ ఆచారం తప్పనిసరి కాదనే అభిప్రాయాన్ని ఇదివరకు విచారించిన ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా స్పష్టం చేశాయని బెంచ్ గుర్తుచేసింది.
ఎటువంటి వివక్ష లేకుండా స్కూల్ యూనిఫామ్ రూల్స్ అందరికీ సమానంగా అమలు చేస్తున్నంతవరకు ఆ స్కూల్ తన డ్రెస్‌కోడ్‌ను అమలు చేసుకునే పూర్తి అధికారం కలిగి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు, ఎయిడెడ్ కాని విద్యాసంస్థలు.. తమ పరిధిలో యూనిఫామ్ నిబంధనలను అమలు చేసుకునే హక్కును కలిగి ఉన్నాయని పేర్కొంది. వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఒక్కో విద్యార్థికి యూనిఫామ్‌లో మినహాయింపు ఇచ్చకుంటూ పోతే.. ‘యూనిఫామ్’ అనే భావనకే అర్థం ఉండదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.