Reading Time: < 1 minute
Kriti Sanon Giva Raksha Bandhan Ad Controversy Kangana Ranaut Reaction

Kriti Sanon GIVA Raksha Bandhan Ad Controversy: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘ గివా’ కలసి చేసిన రక్షాబంధన్ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో గివా ఆ యాడ్‌ను తొలగించింది. వాస్తవానికి.. పండగ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాంప్రదాయ పండుగలో బ్రాస్లెట్ మోడల్ బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి రాఖీ కట్టడం ఏంటంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదంలోకి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ఎంట్రీ ఇచ్చి కృతిపై సెటైర్లు వేశారు. రక్షాబంధన్ వంటి పవిత్రమైన పండుగను “బికీనీ” లాంటి దుస్తుల్లో జరుపుకోవడమేంటని ఆమె ప్రశ్నించడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.

ఈ వివాదంపై కృతి సనన్ గట్టిగానే స్పందించింది. పండుగలు అనేవి మనసులోని భావోద్వేగాలు, సంప్రదాయాలకు సంబంధించినవని, ఒక మహిళ వేసుకునే దుస్తుల నెక్ లైన్‌ను బట్టి ఆమె సంస్కృతిని అంచనా వేయలేమని కౌంటర్ ఇచ్చింది. “సంస్కృతీ సంప్రదాయాలు మనసులో ఉంటాయి తప్ప నెక్ లైన్‌లో కాదు” అంటూ ఘాటుగా రాసుకొచ్చింది. అంతేకాకుండా, ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కూడా కుటుంబంలో భాగమేనని, గివా యాడ్‌లో వాటికి రాఖీ కట్టే కాన్సెప్ట్ తనకు ఎంతో నచ్చిందని, అందుకే ఈ ప్రచారంలో భాగమయ్యానని ఆమె స్పష్టం చేసింది. ఈ వివాదం పెద్దదవుతుండటంతో గివా బ్రాండ్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు అత్యున్నత గౌరవం ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. పండుగ సంతోషాన్ని కుటుంబంతో పాటు పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ తీశామని, ఎవరి భావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని కోరింది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ, అందరి గౌరవార్థం ఆ వివాదాస్పద ప్రకటనను అన్ని సోషల్ మీడియా వేదికల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.