
మహబూబాబాద్ జిల్లా కురవిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగకు ముందే తమ్ముడు మృతి చెందడంతో ఓ అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. కురవి గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్ (36) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియల సమయంలో రమేశ్ సోదరి ధనలక్ష్మి తన తమ్ముడి మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘రాఖీ కట్టక ముందే పాడెనెక్కావా తమ్ముడూ’ అంటూ రోదిస్తూ పాడెపై ఉన్న రమేశ్ చేతికి రాఖీ కట్టారు. తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదించాల్సిన సమయంలో, అతడి మృతదేహానికి రాఖీ కట్టాల్సి రావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.
ఇదిలా ఉండగా, రమేశ్ తండ్రి వీరన్న కూడా పది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణించిన పది రోజులకే కుమారుడు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా రెండు మరణాలు సంభవించడంతో బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వచ్చిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి