Reading Time: < 1 minute
Kotha Cinema Movie Director Azhar Introduces 100 New Actors Promotional Event

సినిమా అంటే కేవలం హైదరాబాద్‌లోని స్టూడియోలకే పరిమితం కాదని, పల్లెల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించే వినూత్న ప్రయత్నమే “కొత్త సినిమా”. యువ దర్శకుడు అజర్ పూర్తి స్థాయిలో స్థానిక ప్రతిభను నమ్ముకుని, ఏకంగా వంద మంది కొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్.. ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ (హైదరాబాద్‌లోనే ఎందుకు.. మా ఊర్లో ఎందుకు కాదు?) అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అగ్ర దర్శక, నిర్మాతలు దర్శకుడు అజర్ సాహసాన్ని, ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొనియాడారు. తమ్మారెడ్డి భరద్వాజ “సినిమా టైటిల్ మాత్రమే కాదు, అజర్ చేసిన ప్రయత్నం కూడా కొత్తదే. ఖర్చుకు భయపడకుండా తన ఊరికే వెళ్లి, అక్కడి వారికే శిక్షణ ఇచ్చి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఇదొక అద్భుతమైన ప్రయోగం. సినిమాకు మంచి పేరు రావాలి.” అని అన్నారు.

వీఎన్ ఆదిత్య & వీరశంకర్ మాట్లాడుతూ “అవకాశాలు రాలేదని నిందించేవారు అజర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. హీరోలను నమ్ముకోకుండా కథనే హీరోగా నమ్మి అడుగులేసిన అతని ఆత్మవిశ్వాసమే ఈ సినిమాను విజయతీరాలకు చేరుస్తుంది.” అని అన్నారు. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న కష్టాలను పంచుకుంటూ చిత్ర బృందం ఎమోషనల్ అయ్యింది. డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ “కొత్తవాళ్లం కదా ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊర్లోనే ఆడిషన్స్ నిర్వహించి టాలెంట్ ఉన్నవారిని ఎంచుకున్నాం. సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.” అని అన్నారు. ఒకవైపు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం బాధ్యతలను అజరే స్వయంగా నిర్వర్తిస్తుండటం విశేషం. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే గ్రాండ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. పక్కా లోకల్ టాలెంట్ తో వస్తున్న ఈ “కొత్త సినిమా” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!