Reading Time: 2 minutes

సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. హైదరాబాద్ లో  సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ : సజ్జనార్ 

Caption of Image.

సెల్‌ఫోన్‌లు చోరీ చేసి, బాధితుల బ్యాంక్ ఖాతాలను పూర్తిగా ఖాళీ చేస్తున్న కొత్త తరహా సైబర్ నేరాల ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో  హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా సాగుతున్న ఈ సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు ,బహిరంగ ప్రదేశాలలో వృద్ధులు, అమాయకులను ఈ ముఠాలు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయని చెప్పారు. 

బాధితులు ఫోన్ వాడుతున్నప్పుడు వారు ఇచ్చే Pattern, PIN,  Passwords ను గమనించి, ఆ తర్వాత సమయం చూసి మొబైల్ కాజేస్తున్నారు. ఒకవేళ ఫోన్ లాక్ అయి ఉంటే.. తాము కండక్టర్ లేదా డ్రైవర్ అంటూ నమ్మిస్తూ, మీ ఫోన్ దొరికింది అని చెప్పి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బాధితుల నుంచే స్క్రీన్ లాక్ పాస్‌వర్డ్ రాబడుతున్నారు. ఫోన్ అన్‌లాక్ కాగానే గ్యాలరీ, నోట్స్, మెసేజ్‌లు, వాట్సాప్‌లోని వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు సేకరిస్తున్నారు.  మొబైల్‌లో ఉన్న డెబిట్/క్రెడిట్ కార్డుల ఫొటోలు, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు, పిన్ నంబర్లను తస్కరిస్తున్నారు. చోరీ చేసిన సిమ్ కార్డులను ఉపయోగించి OTPలు పొంది, UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి డబ్బులు బదిలీ చేస్తున్నారు.   నొక్కేసిన నగదును గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ వాలెట్లు, మ్యూల్ అకౌంట్ల ద్వారా మళ్లిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయించాలి.వెంటనే మీ బ్యాంక్ అధికారులను సంప్రదించి బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించాలి.ఫోన్  IMEI నంబర్‌ను CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో బ్లాక్ చేయించాలి. ఒకవేళ మీ ఖాతా నుంచి డబ్బులు కోల్పోయినట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు కోరారు.

©️ VIL Media Pvt Ltd.