Reading Time: < 1 minute

మోడీ సర్కార్ బిగ్ డెసిషన్: పైలట్లందరికీ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి డ్రగ్ టెస్ట్..!

Caption of Image.

న్యూఢిల్లీ: విమాన భద్రత, ప్రమాదాల నివారణపై కేంద్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పైలట్లకు డోపింగ్ టెస్ట్ నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత డోప్ పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు.

ప్రతి పైలట్‌కు సంవత్సరంలో ఒకసారి డోప్ పరీక్ష నిర్వహణపై విమానయాన సంస్థలతో డీజీసీఏ సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. ఈ రూల్ ప్రకారం ప్రతి పైలట్‎కు ఏడాదికోసారి యాదృశ్చికంగా డోపింగ్ టెస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ నిబంధన అమలు విషయంలో ముఖ్యంగా రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సాధ్యమైనంత అత్యున్నత స్థాయి విమానయాన భద్రతను కొనసాగించడం.. ప్రతి పైలట్‏కు డోప్ పరీక్ష నిర్వహణ వల్ల విమానయాన సంస్థలకు కార్యాచరణ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 

ప్రస్తుతం 10 శాతం మందికే

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రతి ఏటా మొత్తం పైలట్లలో 10 శాతం మందికి మాత్రమే యాదృచ్ఛికంగా డోప్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ కొత్త నిబంధన ప్రకారం పైలట్లందరు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి యాదృచ్ఛికంగా డ్రగ్ టెస్ట్‎లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా, ఆగస్టు 4న ఫుకెట్ నుండి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఒక్కసారిగా 300 అడుగుల కిందకు పడిపోవడంతో 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. విమాన ల్యాండ్ అయిన తర్వాత పైలట్ కు డోపింగ్ టెస్ట్ నిర్వహించగా డ్రగ్ పాజిటివ్‎గా తేలింది. ఈ నేపథ్యంలో పైలట్ల డోపింగ్ టెస్ట్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.