Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నేషనల్ హైవేను అప్ గ్రేడ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం బుట్టాయగూడెం–LND పేట, పట్టిసీమ–కొవ్వూరు సెక్షన్లు మధ్య ఉన్న 45.09 కిలోమీటర్ల నేషనల్ హైవేను రూ.840.41 కోట్లతో రెండు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవే 365BBలో భాగంగా ఈ రెండు సెక్షన్ల మధ్య విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టుతో పాటు చుట్ట పక్కల గ్రామాలు కనెక్టివిటీ లభించనుందని తెలిపారు. ఈ విస్తరణ వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కానుండటం, మార్కెటింగ్ వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయ. పొగాకు, చెరకు, ఆయిల్ ఫామ్ తోటలు ఇక్కడ ఎక్కువగా ఉండగా.. ఈ హైవే ద్వారా సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు.

ఇక వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనుండగా.. ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ హైవే విస్తరణ వల్ల మరింత ఉపయోగం కలుగుతుంది. ఇక గోదావరిలో స్నానాలు చేయడానికి వచ్చేవారు, పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ చూసేందుకు వచ్చేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ జాతీయ రహదారి విస్తరణ వల్ల ఏపీ, తెలంగాణ మధ్య కనెక్టివిటీ కూడా మరింత పెరుగుతుంది. ప్రయాణికులు, వ్యాపారులు, పర్యాటకులు.. ఇలా అందరికీ ఉపయోగం కలుగుతుంది. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు, సందర్శకులు ఘాట్‌ల వద్దకు వెళ్లేందుకు కూడా ఈ హైవే విస్తరణతో సౌకర్యాలు లభించనున్నాయి.

ఈ హైవే తెలంగాణలోని సూర్యాపేట నుంచి మొదలవుతుంది. ఖమ్మం, వైరా మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఏపీలోని జీలుగుమల్లి, బుట్టాయగూడెం, పట్టిసీమ మీదుగా కొవ్వూరు వరకు విస్తరించింది. అయితే గతంలో బుట్టాయిగూడెం–LND పేట, పట్టిసీమ–కొవ్వూరు సెక్షన్లు 45.09 కిలోమీటర్ల రోడ్డును విస్తరించలేదు. దీంతో రెండు లైన్లుగా విస్తరించాలని కేంద్రం దగ్గరకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇటీవల ఎంపీ పురందేశ్వరి కూడా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేంద్రం చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ సమీప ప్రాంతాల గుండా ఈ హైవే వెళుతుంది. దీంతో విస్తరణ వల్ల పోలవరం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. ఈ హైవేలో భాగంగా పట్టిసీమ దగ్గర బైపాస్ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే డీపీఆర్ సిద్దం కానుంది.