Reading Time: 2 minutes

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: AI ఎఫెక్ట్‌లోనూ పెర్ఫార్మెన్స్ బోనస్.. ఎంతంటే?

Caption of Image.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఉద్యోగులకు సగటున 70 శాతం బోనస్ అందించనున్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ బోనస్ శాతంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం తక్కువ. ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఈ బోనస్‌ను విడుదల చేయడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

ఉద్యోగుల జాబ్ లెవెల్స్ వారి పనితీరు ఆధారంగా బోనస్ చెల్లింపులు 65 శాతం నుంచి 80 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జేఎల్ 4, జేఎల్ 5 స్థాయి ఉద్యోగులకు మిగతా వారితో పోలిస్తే కొద్దిగా మెరుగైన బోనస్ దక్కింది. ఈ కేటగిరీల్లో అత్యుత్తమ బెస్ట్ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 80 శాతం వరకు బోనస్ లభించినట్లు సమాచారం.

ప్రస్తుతం సాంకేతిక రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. కంపెనీలు వెచ్చిస్తున్న బడ్జెట్ మందగించడం, స్థూల ఆర్థిక అనిశ్చితులు, AI రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు టెక్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ ఇన్ఫోసిస్ గత నెలలో ప్రకటించిన ఫలితాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి కన్సాలిడేటెడ్ నికర లాభంలో 12 శాతం వృద్ధిని సాధించి రూ.7వేల 769 కోట్లను ఆర్జించింది.

ఇన్ఫోసిస్‌లో కీలకమైన భాగమైన జేఎల్ 4, 5, 6 స్థాయి ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా ఔట్‌స్టాండింగ్, కమెండబుల్, మెట్ ఎక్స్‌పెక్టేషన్స్ వంటి కేటగిరీలుగా విభజించి ఈ బోనస్‌లను అందజేశారు. ఉద్యోగులు ప్రస్తుతం సాలరీ హైక్స్ పై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీ ఈ పెంపును రెండు విడతలుగా అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ : యూఎస్ కాలేజీల్లో 15% తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్..

తొలుత జేఎల్ 4, జేఎల్ 5 ఉద్యోగులకు రానున్న ఒకటి రెండు నెలల్లో జీతాల సవరణ ఉండే అవకాశం ఉండగా.. ఆ తర్వాత జేఎల్ 6, అంతకంటే పైస్థాయి ఉద్యోగులకు 2027 జనవరిలో హైక్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది. గతంలో నూతన అప్రైజల్ సైకిల్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 5 నుంచి 8 శాతం వరకు వేతన పెంపును అందించిన ఇన్ఫోసిస్.. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి పెడుతుందనే అంచనాలున్నాయి.

©️ VIL Media Pvt Ltd.