Reading Time: < 1 minute
Homemade Rose Water Diy Recipe For Glowing Skin

Homemade Rose Water: ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రోజ్ వాటర్‌ (గులాబీ నీరు)కు ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడానికి, ముఖానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* తాజా గులాబీ రేకులు – 2 నుంచి 3 కప్పులు

* శుభ్రమైన నీరు – 2 నుంచి 3 కప్పులు

తయారీ విధానం..
ముందుగా గులాబీ రేకులను నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో రేకులు పూర్తిగా మునిగేంత నీటిని పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నీటిని ఎక్కువగా మరిగించకుండా నెమ్మదిగా వేడి చేయాలి. కొద్దిసేపటికి గులాబీ రేకుల రంగు, సువాసన నీటిలోకి వస్తాయి. రేకులు రంగును పూర్తిగా వదిలిన తర్వాత స్టవ్‌ ఆఫ్ చేయాలి. నీటిని వడకట్టి పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచుకోవచ్చు. దీన్ని ఫేస్ టోనర్ లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించవచ్చు.

మరో పద్ధతిలో మరింత స్వచ్ఛంగా..
గులాబీ రేకులను కడిగి గిన్నెలో వేసి అవి మునిగేంత నీటిని పోయాలి. గిన్నెను మీడియం మంటపై ఉంచి నీరు వేడెక్కుతున్న సమయంలో దానిపై మూతను తలకిందులుగా పెట్టాలి. ఆ మూతపై కొన్ని ఐస్ ముక్కలను ఉంచాలి. గిన్నెలో ఏర్పడే ఆవిరి చల్లటి మూతను తాకడంతో నీటి బిందువులుగా మారి కిందికి చేరుతుంది. ఇలా సేకరించిన నీటినే రోజ్ వాటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన రోజ్ వాటర్‌ను వడకట్టి శుభ్రమైన బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజువారీ స్కిన్ కేర్‌లో భాగంగా ఉపయోగించడం ద్వారా ముఖానికి ఫ్రెష్ లుక్ రావడానికి, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి పూర్తిగా ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.