Reading Time: < 1 minute
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా పంపిణీ.. వెంటనే దరఖాస్తు చేస్కోండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం మరో కొత్త స్కీమ్ ప్రకటించింది. అదే ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా కుట్టు మిషన్ పొందవచ్చు. మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు, మహిళా సాధికారితను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. రూ.12 వేల విలువ చేసే ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అర్హులైనవారికి ఉచితంగా అందించనున్నారు.

బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో పథకం

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా వీటిని మహిళలకు అందించనున్నారు. బీసీ కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేయనుండగా.. లబ్దిదారులను ఎంపిక చేసి ఉచితంగా కుట్టు మిషన్లను అందించనుంది. ఈ పథకంలో లబ్ది పొందాలంటే వయస్సు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉండాలి. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సులువుగా అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి అర్హులైనవారు TGOBMMS పోర్టల్‌ https://tgobmms.cgg.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. సంబంధిత జిల్లా బీసీ అభివృద్ది అధికారి, ఈడీ బీసీ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగ బీసీ మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. డ్వాక్రా సంఘాల ద్వారా పూచీకత్తు లేని రుణాలను అందిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. అలాగే మహిళల కోసం శక్తి బజార్లను తీసుకొచ్చింది. ఈ బజార్లలో డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.