Reading Time: 2 minutes

కోహ్లీ, రోహిత్ లేకపోతే ఇంతేనా?.. అయ్యయ్యో బీసీసీఐకి కోట్లు నష్టం వచ్చిందిగా!

Caption of Image.

Kohli– Rohit Effect: ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐకి (BCCI) టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ విషయంలో ఊహించని షాక్ తగిలింది. రాబోయే రెండేళ్లలో భారత్ స్వదేశంలో ఆడబోయే సుమారు 35 మ్యాచ్‌ల కోసం ప్రతీ మ్యాచ్‌కి కనీస ధరగా రూ. 4.85 కోట్లను నిర్ణయించి టెండర్లు పిలిచింది. కానీ ఆగస్టు 13వ తేదీ నాటికి బిడ్స్ సమర్పించడానికి గడువు ముగిసినప్పటికీ, ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేకపోయింది. బీసీసీఐ చరిత్రలోనే బిడ్లు రాక గడువు పొడిగించాల్సి రావడం తొలిసారి. ప్రస్తుతం టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) ప్రతి మ్యాచ్‌కి రూ. 4.2 కోట్లు చెల్లిస్తుండగా, బీసీసీఐ ఏకంగా ధరను భారీగా పెంచడంతో కంపెనీలు వెనకడుగు వేశాయి.

కోహ్లీ, రోహిత్ లేకపోతే క్రేజ్ తగ్గినట్లేనా?: 

ధరను భారీగా పెంచడంతో పాటు స్పాన్సర్లు ముందుకు రాకపోవడానికి వెనుక మరో ప్రధాన కారణం ఉందనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టులు, టీ20లకు దూరమవ్వడమే బ్రాండ్ విలువ తగ్గడానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు లేకపోతే మ్యాచ్‌లకు ఉండే వ్యూయర్‌షిప్, బ్రాండ్ రీచ్ భారీగా తగ్గుతుందని లెక్కిస్తున్న కంపెనీలు.. అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాయి. 

గూగుల్ జెమిని, ఎస్‌బీఐ లైఫ్‌తో డైరెక్ట్ చర్చలు: 

జూలై 20వ తేదీన ఐటీటీ (ITT) డాక్యుమెంట్స్ విడుదల చేసి గడువు పెట్టినా బిడ్లు రాకపోవడంతో బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది. 

* డైరెక్ట్ టాక్స్: గూగుల్ జెమిని (Google Gemini), స్పిన్నీ (Spinny), ఎస్‌బీఐ లైఫ్ (SBI Life) లాంటి పలు బ్రాండ్లతో బోర్డు నేరుగా చర్చలు జరుపుతోంది.

* ఆర్ఎఫ్‌క్యూ (RFQ) విడుదల: అసోసియేట్ పార్ట్‌నర్ హక్కుల కోసం రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ రిలీజ్ చేసింది. పత్రాలు కొనుగోలు చేయడానికి ఆగస్టు 14, స్పష్టతకు ఆగస్టు 16, కొటేషన్లు సమర్పించడానికి ఆగస్టు 25 లాస్ట్ డేట్ గా నిర్ణయించింది.

* టైటిల్ స్పాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాతే అసోసియేట్ పార్ట్‌నర్లు ఖరారవుతారు. హోమ్ సీజన్ ప్రారంభమయ్యేలోపే బీసీసీఐ ఆశించిన భారీ ధరకి స్పాన్సర్‌షిప్ డీల్ క్లోజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.  

©️ VIL Media Pvt Ltd.