
చిన్నారులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజస్థాన్ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. జెన్ జెడ్, జెన్ ఆల్ఫా, జెన్ బీటా జనరేషన్స్ పై ప్రభావం చూపుతున్న జంక్ ఫుడ్, పెరుగుతున్న మొబైల్ స్క్రీన్ సమయం, టెక్నాలజీపై అధిక ఆధారపడటం, పేపర్ లీకులు, గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లలో మౌలిక వసతుల కొరత వంటి సమస్యలపై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ తీవ్ర ప్రభావం చూపుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా స్కూల్ క్యాంటీన్లలో, స్కూల్ గేట్‌కు 50 మీటర్ల పరిధిలో కూల్‌డ్రింక్స్, చిప్స్, బేకరీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించింది. స్కూళ్లలో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఆహారభద్రత, పోషకాహార కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
స్కూల్ క్యాంటీన్లలో అమ్మే ఆహార పదార్థాల్లో ఎన్ని కేలరీలు ఉన్నాయి? ఏ పదార్థాలు ఉపయోగించారు? వాటిలో పోషక విలువలు ఎంత? అనే వివరాలను మెను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని కోర్టు చెప్పింది. ట్రాఫిక్ లైట్ లేబులింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఆదేశించింది.
ALSO READ : ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పెళ్లి చేసుకుంటున్నారు
వీటితోపాటు చిన్నారులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ డివైజ్ లకు ఎక్కువగా అలవాటు పడటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ, డిజిటల్ విద్య భవిష్యత్తుకు అవసరమే అయినప్పటికీ, అవి పిల్లల బేసిక్ లర్నింగ్గ్ అంటే చదువు, రాయడం, లెక్కలు, ఆలోచించే సామర్థ్యాలను కోల్పోతున్నారని స్పష్టం చేసింది.
రూరల్ ఏరియాల్లో స్కూళ్లలో మౌలిక వసతుల కొరత, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే పేపర్ లీకులు వంటి సమస్యలపైనా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో వివరించాలని కోర్టు ప్రశ్నించింది.
హెల్త్, ఎడ్యుకేషన్, సివిల్ సప్లయ్ తదితర శాఖలకు నోటీసులు జారీ చేసిన కోర్టు, తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు విషయంలో నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.