Reading Time: 2 minutes

రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి ఇకలేరు.. నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ కన్నుమూత

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం, కష్టజీవుల విముక్తి కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన రైతు నేత, సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. మల్లారెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామిక, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంది. మల్లారెడ్డి భౌతికకాయాన్ని సోమవారం ఉదయం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌‌‌‌రోడ్స్‌‌‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌‌‌‌కు తీసుకొచ్చారు.

 అక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఎంబీ భవన్‌‌‌‌లో ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించి, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు జాన్‌‌‌‌వెస్లీ తెలిపారు. ఈ అంతిమయాత్రలో పార్టీ శ్రేణులు, రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పోలీస్ పటేల్ పదవిని వదిలి.. ప్రజల పక్షాన నిలిచి..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం తిమ్మంపేట గ్రామంలో సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు 1939 ఆగస్టు 25న మల్లారెడ్డి జన్మించారు. వరంగల్‌‌‌‌లోని మహబూబియా హైస్కూల్, వేయిస్తంభాల గుడి పాఠశాల, ఏబీవీ హైస్కూల్‌‌‌‌లో 10వ తరగతి వరకు చదివారు. 1964 నుంచి 1971 వరకు తిమ్మంపేట పోలీస్ పటేల్‌‌‌‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో గ్రామంపై జరిగిన రాజకీయ దాడుల సమయంలో బాధితుల పక్షాన నిలిచి ప్రజల మనిషిగా మారారు. 1981 నుంచి 1988 వరకు తిమ్మంపేట సర్పంచ్‌‌‌‌గా, సింగిల్ విండో అధ్యక్షుడిగా పనిచేస్తూ పేదలు, దళితుల భూముల పరిరక్షణకు అండగా నిలిచారు. 

1973లోనే సీపీఎం పూర్తికాలం కార్యకర్తగా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మల్లారెడ్డి.. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు, రైతు ఉద్యమాలను పునర్నిర్మించారు. 1973లో నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా, 1981లో వరంగల్ జిల్లా కార్యదర్శిగా, 1999లో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా, 2003లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్​) జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1985లో సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, 1991లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 2005లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, 2015లో కంట్రోల్ కమిషన్ చైర్మన్‌‌‌‌గా వ్యవహరించారు.

సిద్ధాంతవేత్తగా.. 20కి పైగా పుస్తకాల రచన

మల్లారెడ్డి కేవలం ఉద్యమకారుడిగానే కాకుండా వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై అపార పరిజ్ఞానం ఉన్న సిద్ధాంతవేత్తగా పేరొందారు.  రైతు ఉద్యమ చరిత్ర 1947–2007, బడుగు రైతుల వెతలు, తెలంగాణలో సాగునీటి వనరులు– -అవకాశాలు, రాష్ట్రంలో నదీజలాలు, ప్రాజెక్టులు, వివాదాలపై  
పుస్తకాలను రచించారు.

గొప్ప రైతు ఉద్యమ నాయకుడు: మాజీ సీఎం కేసీఆర్ 

గొప్ప రైతు ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని బీఆర్‌‌‌‌ఎస్ చీఫ్‌‌, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సారంపల్లి తన జీవిత కాలమంతా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పోరాటం చేసిన గొప్ప రైతు ఉద్యమ నాయకుడని కేసీఆర్ కొనియాడారు. 

సీఎం రేవంత్​ రెడ్డి నివాళి

మల్లారెడ్డి మరణించారని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి మల్లారెడ్డి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సారంపల్లి మృతికి సీపీఎం నేతలు బీవీ రాఘవులు, వీరయ్యతోపాటు సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సంతాపం తెలియజేశారు. టీఆర్​ఎస్​ అధినేత కల్వకంట్ల కవిత సానుభూతిని ప్రకటించారు. 
 

©️ VIL Media Pvt Ltd.