Reading Time: < 1 minute
Telangana Congress Konda Surekha Chinna Reddy Disciplinary Action High Command

OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడంతా… సింగిల్‌ పాయింట్‌ డిస్కషన్ నడుస్తోంది. అదే… క్రమ శిక్షణ చర్యలకు సంబంధించి. మంత్రి కొండా సురేఖను కేబినెట్‌ నుంచి బర్తరఫ్ చేస్తారా..? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డిపై వేటు వేస్తారా..? హస్తిన నాయకత్వం ఏం చేయబోతోందంటూ ఎవరికి వారు చర్చలు పెట్టేస్తున్నారు. తమతమ పరిధిలోని సోర్స్‌లో ఆరా తీసేస్తున్నారు. రకరకాల విశ్లేషణలు సైతం జరిగిపోతున్నాయి. ఓవర్ టు ఢిల్లీ అన్న మాటలతో ఉత్కంఠ ఇంకా పెరిగిపోతోంది. ఈ వ్యవహారాలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నివేదిక సిద్ధం చేసి పీసీసీకి ఇచ్చేశారు. అందులో కఠిన చర్యలకు సిఫారసు చేశారాయన. క్రమశిక్షణ తప్పిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నదే కమిటీ నివేదిక సారాంశం. షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సమాధానం సరిగా లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశం పెట్టి మరీ… చర్యలు తీసుకోవాలని చెప్పినందున యాక్షన్‌ ఉండాల్సిందేనన్న అభిప్రాయంతో… క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిందని అంటున్నారు.

సామాజిక సమీకరణాలు… ఇతరత్రా అంశాలన్నిటినీ పరిశీలించిన కమిటీ…. చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కూడా సీరియస్‌గానే ఉందంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే… కులాల లెక్కలు తెర మీదికి వస్తాయి కాబట్టి… ఒకేసారి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎలాగూ చిన్నారెడ్డి ఎపిసోడ్‌లో కూడా హైకమాండ్ సీరియస్‌గానే ఉంది కాబట్టి…. అటు కొండా సురేఖ…ఇటు చిన్నారెడ్డి మీద ఒకేసారి చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసిందన్నది అంతర్గత సమాచారం. అదే సమయంలో… కొండా ఎపిసోడ్‌ను పార్టీ చూసుకుంటుంది… ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పష్టంగా చెప్పినందున ఆ విషయంలో క్లారిటీ వచ్చినట్టేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఓవరాల్‌గా కొండా, చిన్నారెడ్డి ఎపిసోడ్‌ హైకమాండ్ కోర్ట్‌లోకి వెళ్ళినట్టయింది. ఇద్దరి మీద వేటుకు రంగం సిద్ధమైందని పార్టీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతున్న క్రమంలో… హైకమాండ్ తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.