లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యం: రాంబుటాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని, అధిక రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువ. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో శక్తివంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై ముడతలు, అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.
ఇందులో ఉండే భాస్వరం, విటమిన్ సి ఎముకలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడతాయి. రాంబుటాన్లోని యాంటీఆక్సిడెంట్లు వాపుతో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా వివిధ రకాల క్యాన్సర్ల నుండి, ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ నుండి రక్షణ కల్పించగలవు. కొన్ని నివేదికల ప్రకారం, ప్రతిరోజూ ఐదు రాంబుటాన్లు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
జాగ్రత్తలు: రంబుటాన్ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ పండును తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మధుమేహంలో ఇది మంచిదే అయినప్పటికీ, మితంగా తీసుకోవడం ముఖ్యం. ఈ పండు సీజన్ ప్రధానంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉంటుంది. ఇది ఎరుపు లేదా పసుపు రంగులో లభిస్తుంది. శరీరంలో గాయాలు త్వరగా మానేలా చేసే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి.




