Reading Time: < 1 minute
Up Haryana Actor Youtuber Ankit Balian Shot Dead In Shamli

ఉత్తరప్రదేశ్‌లో యూట్యూబర్, హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం షామ్లీలో జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

షామ్లీలో బుధవారం సాయంత్రం హర్యానా నటుడు అంకిత్ బలియాన్‌ జిమ్‌కు వెళ్లి అక్కడి నుంచి బయటకు వస్తుండగా దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయాడు. తుపాకీ కాల్పుల శబ్దం విని సమీపంలోని ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునితీవ్రంగా గాయపడిన అంకిత్ బలియాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వారిని గుర్తించడంలో సహాయపడటానికి సమీప నివాసితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

అంకిత్ బలియాన్ హర్యానా సంగీత ప్రపంచంలో.. సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు. ‘భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్’ అనే పాటతో ప్రసిద్ధి చెందారు. 2023లో షామ్లీలో ఆయన చేసిన రోడ్ షో కూడా చర్చనీయాంశమైంది. ఆయనను షామ్లీలోని బంతిఖేడాకు చెందిన హర్యానా కళాకారుడిగా అభివర్ణిస్తారు. సోషల్ మీడియాలో కూడా సుప్రసిద్ధుడు. సంగీతం, వీడియోల ద్వారా ప్రజలలో చురుకుగా ఉండేవారు.

అంకిత్ బలియాన్ జిల్లా పంచాయతీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే హత్య వెనుక ఉన్న అసలు కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. పోలీసులు ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం.. ఇందులో ప్రమేయం ఉన్నవారి వివరాలు స్పష్టమవుతాయి.

పోలీసులు నేరస్థలం, చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. దర్యాప్తు బృందం ఫుటేజీ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు ముందు అంకిత్ బలియాన్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయో.. అలాగే దాడి చేసిన వారు సంఘటనా స్థలానికి ఎలా వచ్చారో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.