Reading Time: < 1 minute
Jagan To Hold Ysrcp Key Leaders Meeting On Party Strengthening Local Polls

YS Jagan: స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోన్న సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ ఎన్నికలపై ఫోకస్‌ పెడుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని పార్టీ సంస్థాగత పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైసీపీని మరింత బలోపేతం చేయడం, నేతలు-కార్యకర్తలను ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై జగన్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ, దాని ప్రభావం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపైనా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నాయకుల సమన్వయం, ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే అంశాలపై జగన్‌ నేతలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, స్థానిక ఎన్నికలకు వ్యూహరచన వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.