
- జై శ్రీరామ్, ప్రీమియం రకాలు ఇంకా ఎక్కువ
- ఉచిత సన్నబియ్యంతో మొదట్లో తగ్గిన రేట్లు
- జులై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు
- ఎడాపెడా వేలం వేస్తున్న
- ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ శాఖ
- ఇథనాల్ తయారీకి మళ్లుతున్న రైస్
- ఎల్‌నినో బూచి.. రైస్ షార్టేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు
- ప్రభుత్వాల తీరూ కారణమే అంటున్న ఎక్స్‌పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు మళ్లీ పిరమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, వరి సాగు తగ్గుతుందనే అంచనాలను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికితోడు మిల్లింగ్కోసం సర్కారు కేటాయిస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించి, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అమ్ముకోవడం.. ఇథనాల్ ఫ్యాక్టరీలకు ఎఫ్‌సీఐ విక్రయిస్తుండడంలాంటి కారణాల వల్ల మార్కెట్‌లో నిల్వలు తగ్గిపోయినట్టు తెలుస్తున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు 2 నెలలుగా బియ్యం రేట్లను ఎడాపెడా పెంచుతున్నారు. హెచ్‌ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్)తో పాటు ప్రీమియం రకం జై శ్రీరామ్ బియ్యం రేట్లు రెండు నెలల్లో క్వింటాల్ మీద రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు పెంచేశారు. ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నందున వాస్తవానికి మార్కెట్‌లో సన్నబియ్యం రేట్లు తగ్గాలి.
ఈ ఏడాది జూన్ దాకా ఇదే పరిస్థితి ఉన్నది. కానీ జులై తర్వాత వ్యాపారుల మాయాజాలం వల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా సన్నబియ్యం రేట్లు పెరిగి, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు నెలల్లో రూ. వెయ్యికి పైగా పెరుగుదల
రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లో రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో ఆ ఏడాది డిసెంబర్ వరకు ధరలు బాగా తగ్గాయి. హెచ్‌ఎంటీ, కర్నూల్ మసూరి, జై శ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్, సాంబా రకాల ధరలు క్వింటాలుకు రూ.వెయ్యి వరకు పడిపోయాయి.
ప్రస్తుతం వ్యాపారులు ఎల్‌నినోను సాకుగా చూపి ఈ జులై నుంచి క్రమంగా బియ్యం రేట్లు పెంచుతున్నారు. రెండు నెలల్లో క్వింటా ధర రూ. 800 నుంచి రూ.1200 వరకు పెంచేశారు. ప్రస్తుతం నాణ్యత, పండించిన కాలం, పాలిషింగ్, బ్రాండ్‌ను బట్టి హోల్‌సేల్ మార్కెట్‌లో సన్న బియ్యం క్వింటాల్‌కు రూ.5,400 నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారు.
ఆగస్టు 22న రాష్ట్రంలో సాధారణ బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు రూ.57.82గా నమోదు కాగా, ఇది మేలో రూ.51.66గా, జులైలో రూ.54.06గా ఉంది. ఉదాహరణకు మహబూబాబాద్‌లో జూన్‌లో క్వింటాల్‌కు రూ.4,600గా ఉన్న ఆర్‌ఎన్‌ఆర్/హెచ్‌ఎంటీ ధర ఆగస్టు నాటికి రూ.5,500కు చేరింది. జై శ్రీరామ్ ధర రూ.5,600 నుంచి రూ.6,300కు ఎగబాకింది. గరిష్టంగా రూ. 900 వరకు రేట్లు పెరిగాయి. పలు రకాల సన్న బియ్యం రేట్లు హోల్‌సేల్‌లో రూ.7 వేల వరకు ఉండగా.. జై శ్రీరామ్ రకానికి అంతకన్నా ఎక్కువ రేటు పలుకుతున్నది.
చాలా సన్నగా, వండినప్పుడు గింజ పొడవుగా ఉండే బియ్యానికి పట్టణాలు, నగరాల్లో డిమాండ్ ఉంది. అందువల్ల జై శ్రీరామ్‌లాంటి ప్రీమియం బ్రాండ్ల రేట్లు గణనీయంగా పెంచి అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు.
రిటైల్‌లో కిలోకు రూ.10 రూ.12 వరకు బాదుడు
రిటైల్ మార్కెట్‌లో సామాన్యుడి మీద నేరుగా భారం పడుతున్నది. హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌లాంటి ఫైన్రకాల ధరలు కిలోకు దాదాపు రూ.10 నుంచి రూ.12 వరకు (క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1200 దాకా) పెరిగాయి. వివిధ రకాల సన్న బియ్యం కిలో రూ.55–75 మధ్య పలుకుతున్నది. జై శ్రీరామ్‌తోపాటు నాణ్యత గల ప్యాకింగ్ చేసిన సన్నబియ్యం రేట్లు రూ.65 నుంచి 75 వరకు ఉన్నాయి.
‘ఎల్‌నినో’ బూచి
ధరల పెరుగుదలకు వ్యాపారవర్గాలు ఎల్‌నినో, వర్షపాతం లోటు, సాగునీటి కొరత, వరిసాగుపై అనిశ్చితి కారణాలుగా చూపుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండడం, వరి సాగు 10 లక్షల ఎకరాలకు పైగా పడిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆగస్టు 24 నాటికి దేశంలో సాధారణ వర్షపాతం కంటే 13 శాతం తక్కువగా నమోదైందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
‘ఈసారి పంట తగ్గుతుంది.. సన్న రకాలకు కొరత వస్తుంది.. ధరలు ఇంకా పెరుగుతాయి’ అన్న ప్రచారం కూడా బియ్యం రేట్ల మీద ప్రభావం చూపుతున్నది. సన్నాల దిగుబడి తగ్గుతుందన్న అంచనాలతో ముందస్తుగా బియ్యం నిల్వలు పెంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు స్టాక్ పెంచుకోవడంవల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వాల తీరూ కారణమే..
ఎల్‌నినో పరిస్థితులను ముందస్తు అంచనా వేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్, లిక్కర్, ఇతరత్రా అవసరాల పేరుతో బియ్యాన్ని ఎడాపెడా వేలం వేసి విక్రయించడం కూడా బియ్యం రేట్ల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఎఫ్‌సీఐ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2026 జులైలో రాజ్యసభకు కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో.. గతేడాది ఇథనాల్ డిస్టిలరీలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) 6.35 మిలియన్ టన్నుల బియ్యాన్ని విక్రయించిందని ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది.
సేకరించిన ఖర్చు కంటే తక్కువ ధరకు డిస్టరీలకు బియ్యాన్ని అమ్మకానికి పెట్టడం వివాదాస్పదమైంది. ఇలా సేకరించిన బియ్యాన్ని కొన్ని ఇథనాల్ కంపెనీలు పక్కదారి పట్టించి విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు ఆర్జిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మొత్తం మీద ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్సప్లై కార్పొరేషన్‌లాంటి సంస్థలు వేలం పాటల ద్వారా గోడౌన్లలోని బియ్యాన్ని ఖాళీ చేస్తుండడంతో ఆ మేరకు కొరత ఏర్పడి క్రమంగా రేట్ల పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
మున్ముందు రేట్లు ఇంకా పెరుగుతాయి
గత రెండు నెలలుగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గతంలో కిలో రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మిన సన్న బియ్యం ఇప్పుడు రూ.60 నుంచి రూ.70కి పైగా విక్రయిస్తున్నాం. మార్కెట్‌లో ధాన్యం లేకపోవడం, వర్షాభావ పరిస్థితులతో వరిసాగు తగ్గడం తదితర కారణాల వల్ల బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ కొనసాగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
– జంగాల విజయ్, బియ్యం వ్యాపారి, మహబూబాబాద్