
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై వస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం లండన్ పర్యటనకు వెళ్లే ముందే కేంద్ర విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్లే ముందు విధిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాంగ్రెస్ హారం నుంచి వస్తున్న నిబంధనల ప్రకారమే ఇవి అమలవుతాయని ఆయన గుర్తుచేశారు.
అమెరికా పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖకు సరైన సమాచారం, క్లారిటీ ఇవ్వలేదని.. అందుకే పర్మిషన్ ఇవ్వలేదని కిషన్ రెడ్డి తెలిపారు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, సీఎం పర్యటనను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎవరికీ లేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించుకుని కొద్దిమంది మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌తో పాటు తాడిచర్ల గనులను సింగరేణికి కేటాయించడంలో కేంద్రం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన బోయగూడెం బ్లాక్ 3ని రద్దు చేసి, దానిని కూడా సింగరేణికి ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని, సంస్థలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిషన్ రెడ్డి సూచించారు. కొత్త బ్లాక్‌లను దక్కించుకుంటేనే సింగరేణి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.