
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం చట్టరీత్యా నేరమని అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. అక్రమంగా పరీక్షలు చేయించి, ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని భార్యలను వేధిస్తున్న ఘటనలు మాత్రం అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గుంటూరులో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. మూడు సార్లు గర్భంలో ఆడపిల్లే పుడుతుందని తెలుసుకున్న భర్త.. భార్యను వదిలించుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.
గుంటూరు నగరంలోని వెంకటప్పయ్య కాలనీకి చెందిన పడిదపు దుర్గకు 2020లో యర్రగుంట్లపాలెం మండలం పదబోయనపల్లికి చెందిన వెంకట రామయ్యతో వివాహం జరిగింది. 2021లో దుర్గ గర్భం దాల్చింది. ఆ సమయంలో భర్త తన స్నేహితుడికి చెందిన డయాగ్నస్టిక్ సెంటర్‌లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు దుర్గ ఆరోపించింది. ఆడపిల్ల పుడుతుందని తెలియడంతో తనను దుర్భాషలాడి పుట్టింటికి పంపించేశాడని తెలిపింది.
ఈ విషయంపై పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన అనంతరం దుర్గను తిరిగి కాపురానికి తీసుకెళ్లాడు. అయితే రెండోసారి ఆమె గర్భం దాల్చినప్పుడు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, మరోసారి ఆడపిల్లే అని తెలుసుకున్న తర్వాత తనను వదిలేశాడని దుర్గ ఆరోపించింది. దీంతో ఆమె పుట్టింటికి చేరి కోర్టును ఆశ్రయించింది. భరణం, పోషణ ఖర్చులు ఇప్పించాలని కోర్టును కోరింది.
కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న వెంకట రామయ్య మరోసారి మాయమాటలు చెప్పి దుర్గను కాపురానికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది. కొంతకాలం తర్వాత మూడోసారి దుర్గ గర్భం దాల్చింది. ఈసారి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆడపిల్ల పుడుతుందని తెలియడంతో నాలుగు నెలల క్రితం తనను మళ్లీ పుట్టింటికి పంపించేశాడని ఆరోపించింది.
ఇక భర్త వేధింపులను భరించలేకపోయిన దుర్గ చివరకు గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు ఆడపిల్లలతో, తన తల్లితో కలిసి గుంటూరులోని పీజేఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పరిస్థితిని చూసిన అక్కడి వారు చలించిపోయారు.
దుర్గ సమస్యను తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వెంటనే స్పందించారు. ఆమెకు అవసరమైన సహాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఆడపిల్ల పుట్టడాన్ని కారణంగా చూపుతూ భార్యను వేధించడం, అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.